చేర్యాల, ఫిబ్రవరి 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగిపోతే, మొత్తం ప్రాజెక్టు మునిగిపోయిందని నానాయాగీ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఏం సమాధానం చెబుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గం వ్యవహరించిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి వాటికి అనుసంధానంగా నిర్మించిన రిజర్వాయర్లకు విడుదల చేస్తే యాసంగిలో సాగు నీటి సమస్య ఉండేది కాదని అన్నారు.
కేసీఆర్ ఆలోచన విధానంతో నాడు పాలన సాగిందని, దీంతో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నట్టు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో సకల వసతులు కల్పించడంతో భక్తులకు వసతి చేకూరడంతో పాటు రూ.20 కోట్ల ఆదాయం పెరిగిందని అన్నారు. కొమురవెల్లి ఆలయాన్ని బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి చేసిందని, మల్లన్నకు స్వర్ణ కిరీటంతోపాటు వెండి సింహాసనం, ఆలయ ద్వారాలకు వెండి తాపడం తదితర శాశ్వత పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేస్తూ చట్టం చేసిన తర్వాతే స్థ్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.