హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి తర్వాత డ్రాపౌట్స్ ఉండొద్దని, విద్యార్థులు కనీసం ఇంటర్మీడియట్ చదువు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 9నుంచి 12 వరకు తరగతులను ఒకేచోట నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అన్న అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. సీనియర్ సెకండరీ స్కూల్స్‌తో డ్రాపౌట్స్ తగ్గే అవకాశముందన్న వాదనల నేపథ్యంలో ఇతర రాష్ర్టాల్లో అడ్మిషన్లు, డ్రాపౌట్స్, ఫలితాలపై అధ్యయనం చేయాలని కోరారు. బుధవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై రేవంత్‌రెడ్డి సమీక్షించారు. సీనియర్ సెకండరీ విధానంపై ఈ విభాగంలో పనిచేసే ఎన్జీవోలు, పౌరసమాజం సూచనలు, సలహాలను పరిగణిలోకి తీసుకోవాలని విద్యా కమిషన్‌కు సూచించారు. ఇంటర్మీడియట్ విద్య మెరుగుకు అన్ని దశల్లో చర్చించి, ఆ తర్వాత శాసనసభలోనూ చర్చకు పెడతామన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లతో పాటు హాజరుపైనా దృష్టిపెట్టాలని సూచించారు.
ఇది తిరోగమన చర్య
సీనియర్ సెకండరీ స్కూల్స్ ఏర్పాటు ఆలోచనను ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది విద్యా వ్యవస్థను 50 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లడమే అవుతుందన్నారు. దీనిని తిరోగమన చర్యగా అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి పతనం దీంతోనే ప్రారంభమవుతుందని, ఈ ఆలోచనను సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతి వారం నివేదిక ఇవ్వండి
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రతి వారం తనకు నివేదికను అందజేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ స్కూళ్ల నమూనాలను పరిశీలించిన సీఎం, ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయపతాకాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక గురుకులానికి స్థల సేకరణ పూర్తయినందున, రెండో గురుకులానికి స్థల సేకరణను త్వరగా పూర్తిచేయాలన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ నమూనాను పరిశీలించి, మార్పులు సూచించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్ణారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి హరిత, జేఎన్టీయూ రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర్రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇంటర్నెట్, ఐఎఫ్‌పీలు మంజూరు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు టీవీ, ఇంటర్నెట్తో పాటు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను (ఐఎఫ్‌పీ) సీఎం రేవంత్‌రెడ్డి మంజూరుచేశారు. డిజిటల్ విద్య కోసం వీటిని మంజూరుచేయాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య కోరగా సీఎం సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరుచేశారు. కాలేజీల నిర్వహణకు విద్యార్థుల సంఖ్యను బట్టి మెయింటెనెన్స్ గ్రాంట్‌కు సైతం సీఎం పచ్చజెండా ఊపారు. దీంతో ఒక్కో కాలేజీకి కనిష్టంగా రూ. 5 వేలు, గరిష్టంగా రూ. 20వేల వరకు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అందుతాయి.