హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆధ్వర్యంలో కల్పిస్తున్న విదేశీ విద్య అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ విద్యాసాగర్ సూచించారు. పీజేటీఏయూ, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్స్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ కోర్సును ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని రిజిస్ట్రార్ తెలిపారు.
1న ‘మన పాఠశాల – మన ఆత్మగౌరవం’ ప్రతిజ్ఞ
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : సర్కారు స్కూళ్లను కాపాడుకోవాలన్న లక్ష్యంతో సెప్టెంబర్ 1న ‘మన పాఠశాల – మన ఆత్మగౌరవం’ పేరుతో సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. హమారా విద్యాలయ – హమారా స్వాభిమాన్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తుండగా, రాష్ట్రంలో మన పాఠశాల – మన ఆత్మగౌరవం పేరుతో ప్రతిజ్ఞ నిర్వహిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ తెలిపారు. ‘పాఠశాలను పరిశుభ్రంగా, క్రమశిక్షణ, ఆకుపచ్చగా, స్ఫూర్తిదాయకంగా ఉంచుతాం. పాఠశాల ఆస్తి, వనరులను జాతీయ సంపదగా పరిగణిస్తాం. కాపాడుతాం. వివేకవంతంగా ఉపయోగిస్తాం. వివక్షలేని వాతావరణాన్ని సృష్టిస్తాం. అంతా సమానమనే స్ఫూర్తితో నేర్చుకోవడం, బోధించడమనే మార్గంలో ముందుకుసాగుతాం. పాఠశాలను సంస్కృతి, సేవ, అంకితభావంతో కూడిన కేంద్రంగా పరిగణిస్తాం. పాఠశాల కీర్తిని పెంచేందుకు నిరంతరం కృషిచేస్తాం’ అంటూ ప్రతిజ్ఞ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతిజ్ఞను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.