హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వాహనదారులు వార్షిక టోల్‌పాస్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డాటాబేస్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాహన్ పోర్టల్‌లోకి అప్లోడ్ చేయకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎల్ఎంవీ వాహనదారులు (కార్లు, జీప్ల యజమానులు) ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్ పొందాలంటే ఆ యజమాని వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కేంద్రం నిర్వహించే వాహన్, సారథి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3 వేల ఫీజుతో ఏడాదికి 200 సార్లు (200 ట్రిప్పులు) టోల్గేట్ దాటే వెసులుబాటు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నదని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి ఉమాశంకర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని తెలిపారు.