హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకు లాల్లో విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడం, పారిశుధ్య పనులు చేయించడం తప్పేమీ కాదని మాట్లాడిన సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణిపై సత్వరం చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కు ల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులను తక్కువ చేసి మాట్లాడిన ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిపై జాతీయ బాలల హక్కుల కమిషన్‌లో న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై బాలల హక్కుల కమిషన్ తాజాగా స్పందించింది. సెక్రటరీ వర్షిణి, ఎస్సీ గురుకుల అడిషనల్ సెక్రటరీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫేక్ కాలేజీల్లో చేరకండి: బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కొన్ని ఫేక్ కాలేజీలతో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సూచించారు. గుర్తింపులేని కాలేజీల్లో చేరి, అడ్మిషన్లు పొంది తిప్పలు పడొద్దని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వైస్ చైర్మన్లతో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. హైదరాబాద్‌లోని బైటెక్సల్ టెక్‌ఎడ్ ప్రైవేట్ లిమిటెడ్, లీప్‌స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటెల్లిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీతోపాటు మరో సంస్థపై తమకు ఫిర్యాదులందాయని, నోటీసులు జారీచేశామని తెలిపారు.
సర్కార్ కాలేజీల్లో లక్ష మందిని చేర్పించాలి: ఆదిత్య
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : సర్కారు జూనియర్ కాలేజీల్లో లక్ష మంది విద్యార్థులను చేర్పించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులకు సూచించారు. ఈ విద్యాసంవత్సరంలో లక్ష మందిని చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లతో ఆన్లైన్లో సమీక్షించారు. ఇప్పటి వరకు 35వేల మంది అడ్మిషన్లు పొందినట్టు వెల్లడించారు.