రాజాపేట, ఫిబ్రవరి 15 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట తహసీల్దార్ సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.3.30 లక్షలు పోగొట్టుకున్నారు. రాజాపేట తహసీల్దార్ దామోదర్‌కు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని ఫోన్‌చేశారు. ‘నీ అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. డబ్బులు ఇస్తే చర్యలు తీసుకోం. లేకుంటే అరెస్ట్ చేస్తాం’ అని బెదిరించారు. దాంతో వణికిపోయిన తహసీల్దార్ దామోదర్ రూ. 3.30 లక్షలు ఆన్లైన్ ద్వారా చెల్లించినట్టు ఓ కథనం సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్నది. ఈ విషయమై శనివారం తహసీల్దార్ దామోదర్‌ను వివరణ కోరగా ఈ నెల 9న తన పర్సనల్ ఫోన్ ఇంట్లో పెట్టి ఓ శుభకార్యానికి వెళ్లానని, ఆ ఫోన్ మోగడంతో తన కుమారుడు రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసినట్టు తెలిపారు. ‘మీ నాన్న అవినీతి చిట్టా అంతా మా వద్ద ఉంది. తప్పక చర్యలు తీసుకుంటాం’ అని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. రెండు నెలల్లో రిటైర్మెంట్ ఉండటంతో ఏమీ కావద్దనే భయంతో రూ. 2.80 లక్షలు తన అకౌంట్ నుంచి, స్నేహితుల అకౌంట్ నుంచి మరికొంత డబ్బు ఆన్లైన్ ద్వారా ద్వారా పంపించినట్టు చెప్పారు. ఫోన్ చేసిన నంబర్‌కు మళ్లీ రాత్రికి, తిరిగి ఉదయం కాల్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చిందని తెలిపారు. దీంతో సైబర్ మోసగాల చేతిలో మోసపోయామని తెలుసుకొని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తహసీల్దార్ పేర్కొన్నారు.