హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రజలు వివిధ పనుల మీద సచివాలయానికి వస్తుంటారు. కానీ ప్రభుత్వం సాధారణ సందర్శకులపై రోజుకో కొత్తరకం ఆంక్షలు అమలు చేస్తున్నది. దీంతో సచివాలయం విజిటర్స్ ఇబ్బందులు పడుతున్నారు. కొందరిని ఎలాంటి తనిఖీలు చేయకుండా, వాహనాలతోపా టు అనుమతిస్తున్న భదత్రా సిబ్బంది, సామాన్య ప్రజలను మాత్రం తనిఖీల పేరుతో అవస్థలకు గురిచేస్తున్నారు. విజిటర్స్ పాస్ ఇచ్చే మీడియా సెల్ కౌంటర్లోని భద్రతా సిబ్బంది వ్యక్తిగత సెల్ఫోన్లలో సందర్శకుల ఫోటోలు తీయడం విమర్శలకు తావిస్తున్నది. మధ్యాహ్నం 3-5 గంటల నిర్ణీత సమయంలో వివిధ పనుల మీద వచ్చే సందర్శకుల పట్ల భద్ర తా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించటం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు.
ఆధార్ కార్డు చూపించి, దరఖాస్తు ఫారం నింపితే.. విజిటర్ పాస్ తీసుకోవచ్చు. ఏ పని మీద వచ్చారో తెలిపే పత్రా లు చూపించాలి. ఇంతకుముందు పాస్‌లు ఇచ్చే డ్యూటీని క్లర్క్ స్థాయి ఉద్యోగి చూసేవారు. కానీ ఇప్పుడు నలుగురు పోలీసులతో బృందాన్ని రంగంలోకి దింపారు. వీరు సందర్శకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వస్తే.. పత్రాలు చూపించాలంటూ ఆటంకాలు కలిగించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గురువారం ఆదిలాబాద్ నుంచి తహసీల్దార్ స్థాయి అధికారి ఒకరు సచివాలయానికి వచ్చి తన ఐడీకార్డు, ఆధార్‌కార్డు చూపించినా.. పాస్ ఇవ్వలేదని తెలిసింది. ఏం పని కోసం వచ్చారో ఆధారాలు చూపాలంటూ భద్రతా సిబ్బంది ప్రశ్నించడం ఏంటని సదరు అధికారి విస్మయం చెందారు. కొందరు అత్యవసర పరిస్థితులో కూడా సచివాలయానికి వచ్చి… భద్రతా సిబ్బంది తీరుతో వెనుదిరిగిపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.