హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గట్టి హెచ్చరికలు జారీచేసింది. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని, ఇలా వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ కాలేజీలకు మంగళవారం టీఏఎఫ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా అదనంగా వసూలు చేయరాదని కమిటీ స్పష్టంచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ. 2లక్షలు (ప్రతి విద్యార్థీ) వరకు జరిమానా విధిస్తామని టీఏఎఫ్ఆర్సీ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, సీట్లు వచ్చిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేస్తున్నారు. రిపోర్టింగ్ చేసేందుకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు, ఎన్బీఏ ఫీజు, స్పెషల్ ఫీజు, కెరీర్ డెవలప్మెంట్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఫీజుల పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.49వేలు గుంజుతున్నాయి. ఇదే విషయంపై ఈ నెల 26న ‘ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులుం’ శీర్షికతో కథనం ప్రచురితమయ్యింది. పలు కాలేజీల్లో ఎలా దోపిడీ జరుగుతున్నదో కొన్ని ఉదాహరణలు ప్రస్తావించింది. దీంతో టీఏఎఫ్ఆర్సీ స్పందించి మంగళవారం కాలేజీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థుల నుంచి ఏ పేరుతోను అదనపు రుసుములు వసూలు చేసే అధికారం కాలేజీలు, విద్యాసంస్థలకు లేదని టీఏఎఫ్ఆర్సీ స్పష్టంచేసింది. ఇలా వసూలు చేసే ఫీజులను క్యాపిటేషన్ ఫీజులుగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఒకవేళ అదనపు ఫీజులు వసూలు చేస్తే తల్లిదండ్రులు, విద్యార్థులు తగు ఆధారాలు, డాక్యుమెంట్లతో టీఏఎఫ్ఆర్సీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నది.