హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): బ్యాంకులను మోసం చేసిన కేసులో డెకన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు టీ వెంకట్రామ్రెడ్డి, పీకే అయ్యర్, వారి స్టాట్యూటరీ ఆడిటర్ మణి ఊమెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో అదుపులోకి తీసుకొన్నారు. ఈ ముగ్గురిని రోజంతా విచారించామని, విచారణకు సహకరించపోవటంతో సాయంత్రం అరెస్టు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.
వీరిని బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. డీసీహెచ్ఎల్, దాని ప్రమోటర్లు బ్యాంకుల నుంచి రూ.8 వేల కోట్ల అప్పు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో వెంకట్రామిరెడ్డిపై ఈడీ అభియోగాలు నమోదుచేసింది. 16 బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. రుణాలు ఎగవేతపై గతంలో సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. రుణాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామిరెడ్డిపై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతున్నది. గతంలో వెంకట్రామిరెడ్డికి చెందిన రూ.3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరులోని కంపెనీ ఆస్తులను ఈడీ గతంలో అటాచ్ చేసింది.