హైదరాబాద్/సిటీ బ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 28న (మంగళవారం) సీఎం కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం సరికొత్త ఆవిష్కరణ’ అన్న అబ్రహాం లింకన్ మాటలను కోట్ చేస్తూ.. 28న టీహబ్-2 భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఫెసిలిటీ సెంటర్.. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాయిదుర్గం నాలెడ్జ్ సిటీ ఎస్ఈజెడ్లో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సంలో దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. టీ హబ్ ప్రారంభించాక ఇన్నోవేషన్ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఐటీ, స్టార్టప్ రంగ నిపుణులు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రముఖుల అభినందనలు
మంత్రి కేటీఆర్ టీ హబ్ 2.0 ట్వీట్‌పై సినీ, క్రీడా ప్రముఖులు స్పందించారు. ‘వావ్.. కేటీఆర్ ఇది చూసి ఒక్కసారిగా స్టక్ అయిపోయా. భవిష్యత్తు నిజంగా అద్భుతంగా ఉంటుంది. భారతదేశంలో ఆవిష్కరణను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టిన మీకు అభినందనలు’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ ట్వీట్ చేశారు. ‘భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు ఇది చాలా గొప్ప చొరవ’ అని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ‘గ్లోబల్ టెక్నాలజీలో బెంగళూరు, చెన్నైని ఓడించడానికి హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దీన్నే ఆరోగ్యకరమైన పోటీ అంటారు, హ్యాపెనింగ్ హైదరాబాద్’ అని జర్నలిస్టు, రచయిత మాధవన్ నారాయణ్, ‘ఎంతో ఆకట్టుకొనే మౌలిక సదుపాయం. కచ్చితంగా భవిష్యత్తే’ అని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్లు చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వ చొరవ, మంత్రి కేటీఆర్ ఆలోచనల ప్రతిరూపం టీహబ్, భారతీయ యువకుల ఆకాంక్షలకు రెక్కలిచ్చిన ఆలోచన ఇది. ఒకప్పుడు భారతదేశ అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా మొదలై.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా రూపాంతరం చెందింది’ అని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సినీ నటులు మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ, అడవిశేష్, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్, సమంత, క్రీడాకారులు సానియామీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు, గగన్ నారంగ్, పారుపల్లి కశ్యప్ సహా వేల మంది నెటిజన్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు.