Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ న్యూ క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా డెవలప్ చేశామని తెలిపారు.
మంచి రాజకీయ నాయకుల వల్లే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కంపెనీ విస్తరణ కోసం ఎవరి వెంట తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్‌కు హబ్‌గా మారిందన్నారు. గత రెండేండ్లుగా తెలంగాణలో లైఫ్ సైన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. యూరప్‌తో పోలిస్తే ఇండియాలో లేబర్ ఛార్జీలు చాలా తక్కువ అని తెలిపారు. త్వరలో లైఫ్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. ఏడున్నర ఎకరాల్లో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ కంపెనీ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కంపెనీ హైదరాబాద్‌లో రూ. 788 కోట్ల పెట్టుబడులు పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కంపెనీ ద్వారా 1000 మందికి ఉపాధి లభించనుంది. లైఫ్ సైన్సెస్ రంగాల్లో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ ముఖ్యమైన కంపెనీ అని పేర్కొన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో హైదరాబాద్ లైఫ్ సైన్స్ రంగం మరింత ముందుకు వెళ్తుందన్నారు కేటీఆర్.