e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides ఐదు అంశాలతో కరోనా గొలుసుకు బ్రేక్‌

ఐదు అంశాలతో కరోనా గొలుసుకు బ్రేక్‌

ఐదు అంశాలతో కరోనా గొలుసుకు బ్రేక్‌
  • రెండో దశ వ్యాప్తిలో లక్షణాలు అధికం
  • క్షేత్రస్థాయిలో నియంత్రణకు ప్రభుత్వం కృషి
  • ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా గర్వపడుతున్నా
  • మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ధర్మకారి రాంకిషన్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : కరోనా రెండో దశ సామాజిక విస్తరణగా మారిపోయిందని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ దవాఖాన సూపరిటెండెంట్‌, మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ ధర్మకారి రాంకిషన్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ గొలుసును తెంచేందుకు ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. కరోనా మొదటి, రెండో దశ, అవి చూపుతున్న ప్రభావం, దాన్ని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలను ఆయన సూచించారు. కరోనా సోకినప్పుడు, కోలుకున్న తరువాత శరీరంలో వస్తున్న మార్పులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

కరోనా వ్యాప్తి మొదటి, రెండోదశకు మధ్య తేడా ఎలా ఉంది?
గతేడాది కరోనా ప్రారంభ దశలో ప్రజల్లో చాలా భయం ఉండేది. అప్పుడు ఇంట్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినా మిగిలిన వారికి నెగెటివ్‌ వచ్చిన సందర్భాలున్నాయి. కానీ రెండో దశలో ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ సంక్రమిస్తున్నది. వ్యాధి లక్షణాలు సైతం పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నది.

రెండో దశ వ్యాధి లక్షణాల్లో ఎలాంటి మార్పులున్నాయి?
మొదటి దశలో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండేవి.. అప్పుడు వ్యాధి లక్షణాలు బయటపడేందుకు వారం రోజులు పట్టేది. రెండో దశలో వైరస్‌ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలే కాకుండా.. వాసన, రుచి తెలియకపోవడం, శరీరం బలహీనంగా మారడం, తిండి తినలేకపోవడం, చర్మ సమస్యలు, నీళ్ల విరేచనాలు, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి.

కరోనా వల్ల శరీరంపై పడే ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
కరోనాను వైద్య పరిభాషలో ఇన్‌ఫెక్షన్‌ అనాలి. ఆ వైరస్‌ మన శరీర భాగాల్లోకి ఎక్కడికి వెళ్లినా అక్కడ మంటగా ఉంటుంది. అది వ్యాపించిన చోట అవయవాలను దెబ్బతీస్తుంది. అలా చెడిపోయిన అవయవాలను వైద్య చికిత్స ద్వారా రిపేరు చేయాలి. వ్యాధి తీవ్రత, మనిషి శరీర స్పందనను బట్టి రికవరీ ఉంటుంది. ఈ వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తుల మీదనే కాకుండా గుండె, కిడ్నీ, ఆహార నాళాల పైన కూడా చూపిస్తున్నట్టు తెలుస్తున్నది.వైరస్‌ సోకిన వారిలో ఇదివరకే షుగర్‌, బీపీ ఉంటే.. అవి మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి స్టెరాయిడ్స్‌ వాడతారు. కేవలం ఆరు నుంచి 15 రోజులలోపు మాత్రమే మందులు వేస్తారు. వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు. కరోనా ప్రభావంతో మనిషి శరీరం బలహీనమవుతుది. వైరస్‌ అన్ని శరీర భాగాలను ఇబ్బంది పెడుతుంది కాబట్టి విశ్రాంతి చాలా అవసరం. బలహీనతను అధిగమించేందుకు, పూర్తిగా కోలుకునేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవడం మంచిది.

వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఏం చేస్తున్నది?
వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు అవలంబిస్తున్నది. వైరస్‌ వ్యాప్తిపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు తమపరిధిలోని ప్రజల జ్వరం, శ్వాస ఇబ్బందులు తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్లి పరీక్ష చేయిస్తున్నారు. అదేవిధంగా రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేస్తున్నారు.

ఫ్రంట్‌ లైన్‌ వారియర్‌గా పనిచేయడం పట్ల మీరెలా ఫీలవుతున్నారు?
ప్రస్తుత కరోనా వ్యాప్తి మెడికల్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్నది. ఈ పరిస్థితిలో కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందించడంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. మా దవాఖాన పరిధిలో 12వేల మందికి పైగా కరోనా రోగులకు వైద్య సేవలు అందించాం. ఇందులో మా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిరంతర కృషి అభినందనీయం. చికిత్స ద్వారా కోలుకుని అధిక శాతం మంది ఇళ్లకు వెళ్లడం సంతోషాన్ని కలిగించింది. అదే సమయంలో వ్యాధి తీవ్రతతో కొందరు మరణించడం చాలా బాధను కలిగించింది. నాకు రెండు సార్లు కరోనా పాజిటివ్‌ వచ్చి వెంటిలేటర్‌ మీదకు వెళ్లాను, చావు అంచులు చూసి వచ్చాక కూడా.. కొవిడ్‌ రోగులకు వైద్యం అందించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎంతోమందిని కాపాడిన నేను మా అమ్మ ప్రాణాలను కాపాడుకోలేకపోయానన్న బాధ నన్ను కలచివేస్తున్నది.

రెండో దశ వైరస్‌ వ్యాప్తి గొలుసును కట్టడి చేయడం ఎలా?
ఇప్పటికే రెండో దశ వైరస్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ అయింది. వేగంగా విస్తరిస్తున్నది. అయినప్పటికీ ప్రధానంగా ఐదు అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగలిగితే వైరస్‌ వ్యాప్తిని కొంతమేరకైనా కట్టడి చేయగలుగుతాం. కనీసం మూడు వారాలపాటు వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా నిరోధించగలగాలి. అప్పుడు వైరస్‌ వ్యాప్తి గొలుసును కొంతమేరకైనా కట్టడి చేయగలం. అయిదు అంశాల్లో మొదటిది.. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం. రెండోది అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. మూడోది, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో 10 రోజులకు నెగెటివ్‌ వస్తుంది. కాబట్టి వీరు అత్యంత జాగ్రత్తగా ఉంటూ.. కుటుంబసభ్యులకు, లేదా ఇతరులకు వైరస్‌ తగిలించకుండా ఉండటం వల్ల వ్యాప్తిని అడ్డుకోగలుగుతాం. నాలుగోది కొన్ని రోజులపాటు ప్రయాణాలు, పెళ్లిళ్లు, సమావేశాలను ఎవరికి వారు రద్దు చేసుకోవాలి, గుంపులుగా చేరకుండా ఉండాలి. ఇక అయిదో అంశం ప్రధానంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. జనాభాలో కనీసం 70 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకోగలిగితే.. వారి ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాపించినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మన భారత సంస్కృతిని గౌరవించి, మన పూర్వపు విధానాలను పాటించడం ఎంతో మంచిది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐదు అంశాలతో కరోనా గొలుసుకు బ్రేక్‌

ట్రెండింగ్‌

Advertisement