సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 7 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి పేరుగా ఉన్న బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి అంకారపు రవీందర్ గుర్తు మార్చడం కలకలం రేపింది. శనివారం ప్రకటించిన జాబితాలో అంకారపు రవీందర్‌ను మొదటి పేరుగా ప్రకటించి ఉంగరం గుర్తు కేటాయించగా, జాబితాలో చివరి పేరు ఉన్న మోర లక్ష్మీరాజం (కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి) అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినప్పటికీ శనివారం సాయంత్రం సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. దీంతో అధికార పార్టీ నేతల సహకారంతో మోర లక్ష్మీరాజం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, రాత్రికి రాత్రి గుర్తులను తారు మారుచేశారు.
హుటాహుటిన ఎన్నికల కమిషన్ ఆదేశాలతో శనివారం రాత్రి 11.30లకు సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు మార్పు చేసి గ్రామపంచాయతీ నోటీస్ బోర్డులో పోలీసుల సహకారంతో అంటించారు. మొదటి పేరుగా ఉన్న అంకారపు రవీందర్‌ను జాబితాలో రెండో స్థానంగా ప్రకటించారు. దీంతో రెండోస్థానంలో ఉన్న ఇటికల మహేందర్ (బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి)కి మొదటి స్థానం ఖరారు కావడంతో ఉంగరం గుర్తు ఇచ్చి, రెండో స్థానానికి మా రిన అంకారపు రవీందర్‌కు కత్తెర గుర్తు కేటాయించారు. శనివారం అంకారపు రవీందర్‌కు ఉంగరం గుర్తు కేటాయించడంతో ప్రచార సామగ్రి, కరపత్రాలు, మ్యానిఫెస్టో పత్రాలను సిద్ధం చేసుకున్నారు. తీరా అర్ధరాత్రి గుర్తులు మారాయని ఎన్నికల అధికారులు రవీందర్‌కు ఫోన్ చేయడంతో కంగుతిన్నాడు. రాత్రికి రాత్రే గుర్తులు మార్చడంతో అధికారుల తీరుపై అంకారపు రవీందర్ మండిపడ్డారు.
పాలకుర్తి, డిసెంబర్ 7 : ‘ఓటు వేసి నన్ను గెలిపిస్తే అంబులెన్స్ సేవలు ఫ్రీ’ అని వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలోని నాలుగో వార్డు అభ్యర్థి. వావిలాలకు చెందిన కోల లక్ష్మణ్‌గౌడ్ బీఆర్ఎస్ మద్దతుతో నాలుగో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన జీవనోపాధి కోసం ప్రైవేట్ అంబులెన్స్ నడుపుతున్నాడు. డ్రైవర్ కం యజమాని.

ప్రచారంలో భాగంగా నాలుగో వార్డులో తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తానని ప్రకటించాడు. తాను పదవిలో ఉండే ఐదేండ్లలో వరంగల్, హనుమకొండ, హైదరాబాద్‌లోని దవాఖానలకు అంబులెన్స్‌లో ఆక్సిజన్‌తో సహా ఉచితంగా తీసుకుపోతానని హామీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.