భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది. స్వతంత్ర భారత సమాఖ్యలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలన్నది భారత జాతీయోద్యమ నాయకుల కోరిక. ప్రజల కోరిక. కానీ, నిజాం రాజు భారత సమాఖ్యలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. భారత సమాఖ్యలో చేరాలని కోరుతూ చాలా మంది భారత స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకునేందుకు 1947 ఆగస్టు 15న ఆసక్తి చూపారు.
మువ్వన్నెల పతాకం భారత దేశానికి సంబంధించినది. కాబట్టి ఇక్కడ ఎగురవేయడం నిషిద్ధమని ప్రభుత్వం నిషేదాజ్ఞలు జారీ చేసింది. ‘జాయిన్ ఇండియా’ అని నినదిస్తూ భారత స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకునేందుకు స్వాతంత్య్రోద్యమకారులు ఉవ్విళ్లూరారు. వాళ్లను సర్కారు అరెస్ట్ చేసింది. నిషేధాజ్ఞలు ధిక్కరిస్తూ జమలాపురం కేశవరావు వరంగల్ జిల్లాలోని మధిర (నేటి ఖమ్మం జిల్లాలో ఉంది) పట్టణంలో మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ జెండా వందనంలో పది వేల మంది పాల్గొన్నారు. జెండా ఎగురవేసినందుకు సర్దార్ జమలాపురం కేశవరావుని పోలీసులు అరెస్టు చేసి, వరంగల్ జైల్లో నిర్బంధించారు.