హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు సోదాలు చేపట్టారు. స్వస్తిక్ కంపెనీలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగాయి. కంపెనీ మేనేజర్లు కల్పనారాజేంద్ర, లక్ష్మణ్ ఇండ్లతోపాటు షాద్‌నగర్, చేవెళ్ల, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లోని వారి కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇటీవల స్వస్తిక్ సంస్థ షాద్‌నగర్ ప్రాంతంలో ఓ మల్టీ నేషనల్ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని విక్రయించిందని, భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన లెకలు మాత్రం బ్యాలెన్స్ షీట్లో చూపించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో ఐటీ అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ) : పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి ప్రవాహాలను సరస్సులు, నీటి వనరుల్లోకి వదలకుండా నియంత్రించేందుకు పరిశ్రమల యజమానులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండ లి మెంబర్ సెక్రటరీ రవి, హైడ్రా కమిషనర్రంగనాథ్ ఆదేశించారు. సోమవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో సరస్సుల సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరస్సులలో నీటి నాణ్యతను పరిరక్షించడంలో హైడ్రా, తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులు సహకరిస్తాయని తెలిపారు. పర్యావరణ ప్రమాణాలు పాటించని పరిశ్రమలు, నిర్మాణ సంస్థలపై జరిమానాలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించేవారు, రియల్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.