ప్రత్యేక ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): ‘అన్ని కులాల వారికి వేదం నేర్పిస్తా. హైందవ ధర్మాన్ని పెంపొందించమే నా లక్ష్యం’ అంటూ పుష్కరకాలం క్రితం పవిత్ర బాసర క్షేత్రంలోకి ఆంధ్రా స్వామీజీ ఒకరు వచ్చారు. 2011లో శ్రీ వేదభారతి పీఠం పేరుతో వేద పాఠశాలను ప్రారంభించారు. అన్ని కులాల పిల్లలకు వేదం నేర్పించడమనేది మంచి విషయమేనని బాసర గ్రామస్థులంతా ఆయనకు బాసటగా నిలిచారు. అమ్మవారి క్షేత్రంలో వేద పాఠశాల ఉంటే గుర్తింపు వస్తుందని భావించారు. హైందవ ధర్మం పేరు చెప్పడంతో హిందూ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నుంచి పూర్తి సహకారం లభించింది. అందరి మద్దతుతో మొదలైన స్వామీజీ ప్రస్థానం నేడు వ్యవస్థలనే శాసించే స్థాయికి ఎదిగింది. స్థానిక నాయకులకు స్వామీజీ ఏం చెప్తే అదే వేదంగా మారింది. అదే ఇప్పుడు ఆయన చేతిలో ఆయుధంగా మారింది.
బాసర క్షేత్ర ప్రతిష్ఠను ఆయన మంటగలుపుతున్నా అడిగేవారు, అడ్డు చెప్పేవారు లేకుండా పోయారు. బీసీ వేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే పోలీసులు, అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది. వేద పాఠశాల ముసుగులో గుర్తింపు తెచ్చుకున్న స్వామిజీ సరస్వతి క్షేత్రానికే పెను ప్రమాదంగా మారుతారని, గోదావరి ఘాట్‌ను కబ్జా చేసి నిత్య హారతి పేరుతో లక్షల రూపాయల వసూళ్ల దందా చేస్తాడని, సరస్వతీ అమ్మవారి సన్నిధిలో అనాదిగా వస్తున్న పలకపై బియ్యంతో చేసే అక్షరాభ్యాసానికి పోటీగా బీజాక్షర విషవృక్షాన్ని నాటుతాడని కలలో కూడా అనుకోలేదని స్థానికులు ఇప్పుడు వాపోతున్నారు. వేద పాఠశాల పేరుతో మొదలు పెట్టి విద్యార్థుల ప్రాణాలు బలిగొనే వరకు ఎన్నో ఆకృత్యాలు, ఎన్నో అరాచకాలు. ఇప్పటికైనా వాటిని అడ్డుకోలేకపోతే బాసర సరస్వతీ అమ్మవారి ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేద విద్యానంద గిరిస్వామి ప్రస్థానం బాసరలో 2007-08 సమయంలో మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ తన శిష్యుడి ద్వారా బాసరలో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఆ భూముల్లో ఓ రాళ్ల గుట్టలో ఉన్న లక్షీనరసింహస్వామి ఆలయాన్ని సైతం స్వామిజీ తొలగించినట్టు స్థానికులు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఈ అంశాలపై వరుస వార్తా కథనాలు సైతం వచ్చినట్టు చెప్తున్నారు. పట్టా భూమి కావడంతో అడ్డుకోలేకపోయామని గ్రామస్థులు అంటున్నారు.
ఇలా స్వామిజీ ప్రస్థానం ఓ ఆలయ విధ్వంసంతో మొదలైందని చెప్తున్నారు. కొంతకాలం అక్కడే గుడిసె వేసుకున్న స్వామి అన్ని కులాలకు వేద విద్య పేరుతో ప్రచారం మొదలుపెట్టారు. అలా 2011లో స్వామీజీ వేద పాఠశాలను ప్రారంభించారు. ఏపీ నుంచి, తెలంగాణలోని కొన్ని జిల్లాల నుంచి వివిధ కులాల విద్యార్థులను పాఠశాలలో చేర్చుకున్నారు. కొంతకాలం అయ్యాక స్థానికంగా పరిచయాలు పెంచుకున్నారు. అలా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నాయకుడితో స్వామీజీకి పరిచయం ఏర్పడింది. 2015లో గోదావరి పుష్కరాల సమయంలో ఆలయ సమీపంలో పుష్కర ఘాట్లు నిర్మించారు.
ఆ సమయంలో గోదావరి పరివాహాక ప్రాంతం మొత్తం ఘాట్లు ఏర్పాటు చేశారు. 2017 నవంబర్ 4న తనకు పరిచయమైన బీజేపీ నాయకుడి ప్రోత్సాహంతో స్వామీజీ దక్షిణ గంగా వేద నిత్యహారతి పేరుతో బాసర గోదావరిలో నిత్య హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఘాట్‌లోని కొంత భాగాన్ని ఆక్రమించారు. అది సదరు బీజేపీ నాయకుడి రిసార్ట్ ముందున్న ఘాట్ కావడంతో అందులో ఆ నేతకు కొంత భూమి ఉందని స్థానికంగా చెప్పుకుంటూ ఘాట్‌ను కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిత్య హారతి నిర్వహణ ఆలోచన వచ్చాక స్వామిజీ పాఠశాలలోని విద్యార్థులను కాశీకి తీసుకువెళ్లారు. అక్కడే కొన్ని రోజుల పాటు గంగా హారతిపై శిక్షణ తీసుకున్నారు. ఆ తరహాలో ఇక్కడ హారతి ఇచ్చేందుకు అక్కడ అర్చకుల భంగిమలు, చదివే మంత్రాలు, డ్రెస్ కోడ్ ఇలా అన్నింటినీ పరిశీలించారు. కాశీ తరహాలో ఇక్కడ హారతి ఇవ్వడం మొదలుపెట్టారు. బాసరకు వచ్చే భక్తులు నిత్యహారతి చూడటం మొదలైంది. అలా నిత్యహారతి కార్యక్రమాన్ని ప్రచారంలోకి తెచ్చారు. భక్తులను ఆకట్టుకొని సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్లను పెంచుకున్నారు. 2017లో వేద పాఠశాల నిర్వహణ, నిత్య హారతి లాంటి దైవ కార్యాలను నిర్వహిస్తున్నామని ఇందుకోసం రూ.15 లక్షల నిధులు కావాలంటూ నేరుగా ప్రభుత్వానికే దరఖాస్తు పెట్టుకున్నారు.
నిర్మల్ నుంచి అప్పుడు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డిపై ఈ మేరకు స్థానికుల నుంచి ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో 2019లో దేవాదాయశాఖ ధూపదీప నైవేద్యం కింద ఆలయానికి వచ్చే సీజీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు వేద పాఠశాలకు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ రూ. 10లక్షలు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు అన్న లెక్కలేవీ చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఈ లెక్కలు వెల్లడించాల్సి ఉందని, కానీ ఆరేండ్లు పూర్తి కావస్తున్నా లెక్కలు చెప్పలేదని, ఇప్పటికైనా ఆ వివరాలు వెల్లడించాలని బాసర ఆలయ ఈవో 2024 జూలై 8న సదరు పాఠశాల నిర్వాహకుడైన స్వామిజీకి లేఖ రాశారు. కానీ దానికి సమాధానం ఇప్పటికీ రాలేదని తెలిసింది. దీంతో ఆ డబ్బులు సైతం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వసూలు చేసిన డబ్బులు ఇన్ని సంవత్సరాలుగా ఎంత మొత్తం వచ్చాయి? ఆ డబ్బులు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారనే దానిపై లెక్కా పత్రాలు లేవు. నిబంధనల ప్రకారం నిత్య హారతిపై వచ్చే ఆదాయం బాసర ఆలయానికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆలయంతో సంబంధం లేకుండా వసూలు చేసిన డబ్బులన్నీ స్వామీజీకి వెళ్లిపోతున్నాయి. పుష్కరఘాట్‌లో నిత్యహారతిలో వచ్చే ఆదాయమే కాకుండా, ఉదయం ఇదే ఘాట్‌ను అద్దెకు ఇస్తారని తెలిసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే అర్చకులు పూజలు చేసుకోడానికి, అపరకర్మలకు, సంకల్పాలకు, యాగాలకు, హోమాలకు ఘాట్‌ను ఇచ్చి డబ్బులు వసూలు చేస్తారని అక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. ఇలా పుష్కరఘాట్‌ను కబ్జా చేసి విచ్చలవిడిగా డబ్బులు వసూళ్లు చేయడం, ఆలయ ఆదాయానికి గండి కొడుతుండటంతో స్థానికుల నుంచి తిరుగుబాటు మొదలైంది.
స్వామీజీ నిత్యహారతి దందా, వేద పాఠశాల విద్యార్థులతో చేయించే వెట్టిచాకిరీ, బీజాక్షరం పేరుతో చేస్తున్న పనులన్నింటినీ కండ్లారా చూసిన బాసర గ్రామస్థుల్లో కొందరు స్వామీజీ తీరును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆలయ ఆదాయానికి గండి కొట్టడం, అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలను తప్పుదోవ పట్టించేలా బీజాక్షరం పేరుతో కొత్త రాగం ఎత్తుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే విద్యార్థులపై దాడులు, ఒకరి మృతితో స్థానికంగా దుమారం రేగింది. దీంతో నిత్యహారతి కార్యక్రమం గ్రామ కమిటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆలయం తరఫున ప్రతి బుధవారం గోదావరికి హారతి ఇవ్వాలంటూ దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వెల్లువడ్డాయి. దీంతో ప్రతి బుధవారం ఆలయ అర్చకులు గోదావరికి హారతి ఇస్తున్నారు.
గత బుధవారం ఆలయం తరఫున స్వామిజీ ఆక్రమిత ఘాట్‌లో పూజారులు హారతి ఇచ్చారు. అధికారుల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు అక్కడ హారతి ఇచ్చినట్టు పూజారులు తెలిపారు. దీంతో ఘాట్ ఎక్కడ చేయిజారిపోతుందోనని భావించిన స్వామీజీ.. స్థానిక ఎమ్మెల్యేలతో ఈవోకు ఫోన్లు చేయించినట్టు తెలిసింది. ఆ ఘాట్‌లో స్వామీజీ మాత్రమే హారతి ఇస్తారని, ఆలయ తరుఫున ఇవ్వొదంటూ సదరు నేతలు హుకుం జారీచేసినట్లు సమాచారం. అప్పటి దాకా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హారతి ఇచ్చిన వేద పాఠశాల నిర్వాహకులు, గురువారం నుంచి తిరిగి ఘాట్‌లోకి రంగప్రవేశం చేశారు. దీంతో ఆ ఘాట్ సరస్వతీ అమ్మవారిదా? లేకపోతే స్వామీజీదా? అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెప్తున్నారు.
వేద పాఠశాల పేరుతో వచ్చి గోదావరి నిత్య హారతి, బీజాక్షరం పేరుతో స్వామీజీ చేసే ఆకృత్యాలకు అడ్డే లేకుండా పోతున్నదని వాపోతున్నారు. ఇప్పటికైనా బాసరలో స్వామీజీ ఆగడాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో బాసర క్షేత్ర ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉందంటున్నారు. స్థానిక నాయకులు సైతం ఇలా వసూళ్ల దందా చేసే స్వామీజీకి సపోర్ట్ చేయకుండా, బాసర అమ్మవారికి అండగా నిలవాలని కోరుతున్నారు.
కబ్జా చేసిన గోదావరి ఘాట్‌లో సదరు బీజేపీ నేత సహకారంతో 2018లో ఓ షెడ్డు నిర్మించారు. గోదావరి (గంగా) మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడే నిత్య హారతి ఇవ్వడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో ఉచితంగానే నిత్యహారతి పేరు చెప్పినా, కొన్నాళ్లకు దోపిడీ మొదలైంది. ఏడాది తిరగకుండానే ఘాట్‌లో గంగా మాత పక్కనే మహంకాళి, దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి, ఐదారు శివలింగాలను ప్రతిష్ఠించారు. ఇక నిత్యహారతి కార్యక్రమ ప్రారంభానికి ముందే రుద్రాభిషేకం, గోదావరి తల్లికి ఒడిబియ్యం పొయ్యడం, చీర సమర్పించడం, దీపాల కోసం నూనె దానంగా తీసుకోవడం అంటూ నెమ్మదిగా వసూళ్ల దందాను మొదలుపెట్టినట్టు తెలిసింది.
వచ్చే భక్తుల స్థాయిని అనుసరించి రుద్రాభిషేకానికి రూ.1000 నుంచి రూ.10 వేలు, ఒడిబియ్యం-నూనె పూజకు రూ.500 చొప్పున వసూలు చేస్తారని తెలిసింది. ఇవి చేయించుకునే భక్తులకు ఎలాంటి రసీదు ఇవ్వరు. ఈ డబ్బులు వేద పాఠశాల, గోశాల నిర్వహణకు డొనేషన్ రూపంలో తీసుకుంటారు. ఇవే కాకుండా గోదావరి హారతి ఇచ్చాక వచ్చే చదివింపులు అదనం. ఇలా ఒక్క పుష్కర ఘాట్‌లోనే రోజూ వారి ఆదాయం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.