హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితోపాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్‌గౌడ్, పార్టీ నేత కిశోర్‌గౌడ్ తదితరులు వివేకానందుడి చిత్రపటానికి పూలమాలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిరికొండ మాట్లాడుతూ.. వివేకానందుడు చిరు ప్రాయంలోనే మరణించినప్పటికీ భారతమాతకు ఎనలేని సేవలు చేశారని శ్లాఘించారు. చికాగో వేదికగా భరతజాతి ఖ్యాతిని చాటిన వివేకానందుడి బోధనలు నేటి తరానికి స్ఫూర్తిదాయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువత దేశసేవలో పాలుపంచుకోవాలని ఉద్బోధించారు. వివేకానందుడి స్ఫూర్తిని భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని స్పష్టం చేశారు.