హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అయినా జాతకాలపై అపార నమ్మకం. అదే ఆమెను బురిడీ బాబా చేతిలో రూ.47 లక్షలకు మోసపోయేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఆ యువతి యూపీ ఘజియాబాద్‌లో ఉంటున్నది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తడంతో జాతకాన్ని బాగుచేసుకోవాలని భావించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ ప్రకటనను చూసి అందులోని ఫోన్ నంబర్‌కు కాల్ చేసింది. గోపాలశాస్త్రి అనే బురడీబాబా మాట్లాడి.. జాతకంలో దోషాలున్నాయని, నివారణ కోసం పూజ చేయాలనడంతో తొలుత రూ.32 వేలు పంపింది. అలా దఫదఫాలుగా రూ.47 లక్షలు రాబట్టుకొన్న ఆ బురిడీ బాబా.. మరిన్ని పూజల కోసం ఇంకా డబ్బు పంపాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఇదంతా మోసమని గ్రహించిన ఆమె బుధవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను సంప్రదించడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అమీర్‌పేటకు చెందిన ఓ వ్యక్తిని గుర్తుతెలియని కేటుగాళ్లు రూ.10 లక్షలకు మోసగించారు. తొలుత బాధితుడిని ఇన్‌స్టాగ్రామ్‌లో బీటీసీ అనే గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆపై క్రిప్టో కరెన్సీలు, ఇతర పెట్టుబడుల గురించి చర్చిస్తూ తమకు భారీగా లాభాలొచ్చాయని చెప్పుకొచ్చారు. నిజమేనని నమ్మిన ఆయన దఫ దఫాలుగా ఆ కేటుగాళ్లకు రూ.10 లక్షలు సమర్పించుకొని నిలువునా మోసపోయాడు.
సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లికి చెందిన ఓ మహిళకు ఫేస్బుక్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. లండన్‌లో ఉంటున్నానంటూ కొన్నాళ్లు చాటింగ్ చేశాక తమ స్నేహానికి గుర్తుగా కొన్ని విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ ఆ మహిళను నమ్మించాడు. ఆ తర్వాత తాను పంపిన బహుమతులను ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకొన్నారని, వాటిని విడిపించేందుకు ఫీజులు కట్టాలని ఫోన్ చేసి రూ.7.88 లక్షలు కాజేశాడు. ఈ రెండు ఘటనల్లో కూడా బాధితులు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.