హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వేదాలు విజ్ఞాన భాండాగారాలని, ఆధునిక మానవ సమాజం శాంతి సౌఖ్యాలతో జీవించటానికి వీటిలోని అంశాలు ఎంతో దోహదం చేస్తాయని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం తిరుపతిలో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. భారతీయులకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వేదాలు అందాయని, ప్రపంచవ్యాప్తంగా వీటిని వ్యాప్తి చేయాల్సిన అవసరమున్నదని తెలిపారు. అనంతరం హైదరాబాద్కు చెందిన వేద పండితుడు బ్రహ్మశ్రీ వీ సుబ్రహ్మణ్యశాస్త్రి, సలక్షణ ఘనాపాఠి, చెన్నైకి చెందిన బ్రహ్మశ్రీ ఆర్ మణిద్రావిడ శాస్త్రికి మహా మహోపాధ్యాయ పురసారం గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.