హుస్నాబాద్, అక్టోబర్ 7: గురుకుల పాఠశాలల్లో నిర్వహణ లోపం మరో పసివాడి ప్రాణాన్ని బలిగొన్నది. నంగునూరుకు చెంది న సనాదుల సత్యనారాయణ, లావణ్య దంపతుల రెండో కుమారుడు సనాదుల వివేక్ (13) హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ శివారులోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల/కళాశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు వెళ్లిన వివేక్‌ను తండ్రి సత్యనారాయణ సోమవారం ఉదయం వసతిగృహంలో వదిలివెళ్లాడు. రాత్రి వేళ ఏం జరిగిందో ఏమోగానీ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెండో అంతస్థు కారిడార్ రెయిలింగ్‌కు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. నడుచుకుంటూ వెళ్తుండగా జారిపడి రెయిలింగ్‌కు ఉన్న బెడ్‌షీట్ తాడుకు తగలడం వల్ల మెడకు ఉరిపడిందని ప్రిన్సిపా ల్, ఉపాధ్యాయులు చెప్తున్నారు.
కానీ చిన్నపాటి చద్దరు గుడ్డ మెడతో ఎలా ఉరి పడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీనియర్ విద్యార్థులతో జరిగిన గొడవ వల్లే ఈ ఘటన జరిగిందా? ఇతర వేధింపుల వల్ల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మృ తికి నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు హనుమకొండ-హుస్నాబాద్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు.
ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వివేక్ చనిపోయాడని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. వివేక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ సదానందం తెలిపారు.