హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ) : మార్కెటింగ్ శాఖలో ఆ ఇద్దరు కార్యదర్శుల అరాచకపర్వం హద్దులు మీరిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలక మార్కెట్లలో ఏండ్లుగా తిష్టవేయడం, అందినకాడికి దోచుకోవడం, ఆపై సస్పెండ్ కావడం, ముడుపులు ముట్టజెప్పి మళ్లీ పోస్టింగ్లు తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారిందనే చర్చ జోరుగా సాగుతున్నది. ఈ అవినీతి అధికారులకు ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక అధికారి అండగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు అధికారుల్లో ఒకరు రెండుసార్లు సస్పెండ్ కాగా, ఒకరు గతంలో సస్పెన్షన్ నుంచి తృటిలో తప్పించుకొన్నారు. ఈసారి మాత్రం తప్పించుకోలేక సస్పెండ్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఆ ఇద్దరు అధికారులు తమ సస్పెన్షన్ను ఎత్తివేయించుకొని పోస్టింగ్ ఇప్పించుకొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీరికి అండగా ఉన్న ఆ కీలక అధికారి సైతం ఇందుకు సంబంధించి మార్గం సుగమం చేస్తున్నారని సమాచారం. ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇవ్వడంతోపాటు వారికి అనుకూలంగా ఏవో కుంటిసాకులు చెప్పి సస్పెన్షన్ను ఎత్తివేయించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. వాళ్ల ప్లాన్ సక్సెస్ అయితే ఈ రెండు మూడు రోజుల్లో సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది.
సదరు కీలక అధికారి అండతో అవినీతికి మరిగిన ఆ ఇద్దరు అధికారులు ఎల్లప్పుడూ కీలకమైన మార్కెట్లలోనే పోస్టింగ్లు ఇప్పించుకున్నట్టు తెలిసింది. ఏండ్లుగా అక్కడే తిష్టవేసి అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో ఓ అధికారి చేసిన అవినీతిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వగా ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. పత్తి కొనుగోళ్ల సమయంలో తాత్కాలికంగా పని చేసిన డీఈవోల (డాటా ఎంట్రీ ఆపరేటర్స్)కు ఇవ్వాల్సిన వేతనాలను ఆయన స్వాహా చేశారనే ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరుపగా అది నిజమేనని తేలింది. 10 మంది డీఈవోల వేతనాల కోసం రూ.5.17 లక్షలు విడుదల కాగా కేవలం నలుగురికి రూ.62 వేలు మాత్రమే చెల్లించినట్టు విచారణలో వెల్లడైంది. విచారణ తర్వాత మరో రూ.79 వేలు చెల్లించినట్టు తెలిసింది. అంటే రూ.3.76 లక్షలను డీఈవోలకు చెల్లించకుండా జేబులో వేసుకున్నట్టు వెల్లడైంది. డీఈవోల జాబితాలో 10 మంది పేర్లు పెట్టగా పనిచేసింది మాత్రం ఆరుగురే అని వెల్లడైంది. నిధులు దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతకుముందు సైతం ఆయన అవినీతి లీలలు భారీగా ఉన్నట్టు తెలిసింది. మిర్చి కొనుగోళ్లలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సస్పెన్షన్కు గురయ్యారు. ఆ తర్వాత మార్కెట్ ఫీజు కింద వసూలు చేసిన రూ.లక్ష ఫీజును కార్యాలయానికి జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో చార్జ్ మెమో జారీ చేసినప్పటికీ ఆ తర్వాత ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోసారి మద్దతు ధరకు పెసర్లు అమ్మిస్తానని చెప్పి రూ.40 వేలు వసూలు చేసినట్టు ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను తొలుత విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అయితే, ఆ తర్వాత మేనేజ్ చేసుకొని ఆ సస్పెన్షన్ను రద్దు చేయించుకొని కేవలం చార్జ్ మెమో జారీ చేసినట్టు తెలిసింది. ఇలా సదరు అధికారి రెండుసార్లు సస్పెండ్ కాగా ఒకసారి తప్పించుకొన్నారు.
నాడు సీతమ్మ రక్షణకు లక్ష్మణ రేఖ మాదిరిగానే మార్కెటింగ్ శాఖలోని ఈ అవినీతి అధికారులను కూడా ఓ ‘లక్ష్మణ రేఖ’ కాపాడుతున్నట్టు తెలిసింది. తెరవెనుక ఉంటూ అన్ని తానై నడిపిస్తున్నట్టు తెలిసింది. కీలక విభాగాలన్నీ తనే వద్దే పెట్టుకొన్న సదరు అధికారి తనకు నచ్చిన వారికి, తాను మెచ్చిన వారికి, తనకు సపోర్ట్ చేస్తున్నవారిని అందలం ఎక్కిస్తారనే పేరు ఉన్నది. వీరికి కీలకమైన స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించడం, గతంలో పలు సందర్భాల్ల్లో సస్పెన్షన్లను ఆపించడం, సస్పెన్షన్ తర్వాత మళ్లీ పోస్టింగ్లు ఇప్పించడం అంతా ఆయనే చూసుకొనేవారని తెలిసింది. ఇప్పుడు కూడా సస్పెన్షన్లో ఉన్న ఆ ఇద్దరు అధికారులను సదరు కీలక అధికారి బయటపడేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఏదో ఒకటి చెప్పి వారి సస్పెన్షన్ను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఇద్దరు అధికారులతో పాటు సదరు కీలక అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, లేనిపక్షంలో మార్కెటింగ్ శాఖ పరువు పోవడం ఖాయమనే అభిప్రాయాలు ఆ శాఖ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఆ ఇద్దరు అవినీతి అధికారుల్లో మరో అవినీతి అధికారి కథ పరిశీలిస్తే… సదరు అధికారి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీలకమైన మార్కెట్లలో ఏండ్లుగా తిష్టవేసినట్టు తెలిసింది. ఆయన పనిచేసిన రెండు మార్కెట్లలోనూ భారీగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తెలిసింది. డ్రా చేసిన పెన్షన్ కాంట్రిబ్యూషన్ నిధుల మొత్తాన్ని హెడ్ ఆఫీసుకు పంపించకుండా అందులో కొంత మొత్తాన్ని సొంతానికి వాడుకున్నట్టు విచారణలో తేలింది. 2020-21లో రూ.98.87 లక్షలు, 2022-23లో రూ.56.97 లక్షలు ఆలస్యంగా జమ చేసినట్టు తెలింది. అదేవిధంగా 2023-24లో డ్రా చేసిన రూ.37.7 లక్షల్లో రూ.15 లక్షల ఇప్పటికీ ప్రధాన కార్యాలయానికి జమకాలేదని తెలిసింది. ఇలా రూ.16.55 లక్షల నిధులు దుర్వినియోగం జరిగిందని విచారణలో తేలింది. దీంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే అదే సమయంలో ఆయన మరో మార్కెట్కు ఇన్చార్జిగా ఉన్నారు. అప్పటికే అక్కడ జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతున్నది. గిడ్డంగుల సంస్థ నుంచి వచ్చిన రూ.10.45 లక్షలను సొంతానికి వినియోగించుకొని ఆ తర్వాత మార్కెట్కు జమ చేసినట్టు నిర్ధారణ అయినట్టు తెలిసింది. అయితే, ఈ కేసులోనూ విచారణ జరిపించిన జిల్లా కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేయగా, పైరవీలతో ఆ సస్పెన్షన్ను నిలిపివేయించుకున్నట్టు తెలిసింది. అదే సమయంలో మరోచోట జరిగిన విచారణలోనూ ఆర్థిక అవకతవకలు బయటపడటంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోలేపోయారని తెలిసింది. అయితే నవంబర్లో నివేదిక ఇవ్వగా ప్రధాన కార్యాలయంలో సదరు కీలక అధికారి దీనిని తొక్కిపెట్టినట్టు సమాచారం. చివరికి మార్చి నెలలో సస్పెండ్ చేసినట్టు తెలిసింది.