వరంగల్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తన టార్గెట్ సీఎం రేవంత్‌రెడ్డే అని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పునరుద్ఘాటించారు. ఇటీవల తాను సీఎంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. వాటిపై సీఎం రేవంత్‌రెడ్డి ఏం మాట్లడుతారో చూశాకే స్పందిస్తానని చెప్పారు. అంతేకానీ తన తల్లి మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఆ మీడియా సమావేశంలో పాల్గొన్న వారిలో అనేకులు పార్టీలు మారిన వారేననే విషయాన్ని వారు గుర్తుంచుకుంటే మంచిదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తమకు నమ్మకం ఉన్నదని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే అంటే గౌరవం ఉన్నదని చెప్పారు.
శుక్రవారం ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించేది పార్టీయే కానీ, సీఎం కాదని చెప్పారు. తన తండ్రి కొండా మురళీధర్‌రావుకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎందుకు మాట తప్పారని తాను అడుగకూడదా? అని సుస్మిత ప్రశ్నించారు. తన తండ్రి ఎమ్మెల్సీగా రెండుసార్లు ఏకగ్రీవంగా గెలిచిన వ్యక్తి అని, ఓడిపోతే ఇంట్లో కూర్చొని, ఎలాంటి జనాదరణ లేని నాయకుడు కాదని చెప్పారు.