కట్టంగూర్, జూలై 12 : ఉపాధి కరువై.. అప్పులు భారమై ఓ చేనేత కార్మికుడు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఏలె శంకరయ్య (47) మొదట నల్లగొండలో చేనేత కార్మికుడిగా పని చేస్తూ మూడేండ్ల క్రితం బతుకుదెరువు కోసం కట్టంగూర్ చేరుకున్నాడు. ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకొని అప్పు చేసి సొంతంగా పవర్ లూమ్ (సాంచాలు) ఏర్పాటు చేసుకున్నాడు.
భార్య నర్సమ్మతో కలిసి మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పవర్లూమ్ పెట్టుబడుల కోసం, పెద్ద కూతురి పెండ్లి కోసం శంకరయ్య రూ.7 లక్షల వరకు అప్పు చేశాడు. కొంతకాలంగా పనులు లేకపోవడం, ఉపాధి అంతంతమాత్రంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ పోషణ కష్టంగా మారడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి పోతుండటంతో మనస్తాపానికి గురై శుక్రవారం గ్రామ శివారులోని సత్యనారాయణపురం సమీపంలో వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శంకరయ్య కుమారుడు ప్రణీత్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు కట్టంగూర్ ఎస్సై ఎన్ శ్రీను తెలిపారు.