Suryapeta Farmers | సూర్యాపేట : బండెనక బండి కట్టి.. ఎడ్ల బండ్లతో సూర్యాపేట రైతాంగం ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయల్దేరారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా ఎడ్లబండి నడిపి రైతు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగదీశ్ రెడ్డి. ఎడ్లబండ్ల యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సుమారు 5 కి.మీ పైగా జగదీశ్ రెడ్డి ఎడ్లబండి నడిపి యాత్రను ఉత్సాహంగా ముందుకు నడిపారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరుగనున్న 25 ఏండ్ల బీఆర్ఎస్ పండుగకు సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేస్తున్నారని తెలిపారు.
రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారు. నీడలో ఉన్న వాళ్ళం ఎండనబడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలాగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. దేవుడు లాంటి కేసీఆర్‌ని వదులుకున్నామన్న బాధలో ప్రజలంతా ఉన్నారు.అందుకే కేసీఆర్ మీద అభిమానంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయలుదేరారని పేర్కొన్నారు. ప్రజలంతా హాజరై ఈసభను కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేక సభలాగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. గత పది రోజులు క్రితం రైతులు కలిసి ఎడ్లబండ్లపై వెళ్తామంటే.. 130 కిలోమీటర్ల మేర ఈ ఎండలో వెళ్లడం సాధ్యమవుతుందా..? అని అడిగాను. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకున్నోళ్లం.. ఈ ఎండలను తట్టుకోవడం లెక్క కాదని రైతులు ధీమాగా చెప్పారు. సభ సమయానికి చేరుకునేలా ముందుగా అనుకున్న ప్రకారం 5 రోజుల ముందుగానే బయలుదేరారని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఎల్కతుర్తి మట్టిని తాకి.. రజతోత్సవ సభను తిలకించి.. కేసీఆర్ మాటలు వినాలన్న రైతుల తపన ఎంతో ఆనందాన్నిచ్చింది. కేసీఆర్ పైన రైతాంగం చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతుంది. కొండంత అభిమానంతో పాటు సాహసోపేతమైన యాత్రగా ఈ ఎడ్లబండ్లలో వెళ్తున్న రైతులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు జగదీశ్ రెడ్డి.
ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూర్ (ఎస్) మండలం నుంచి ఎడ్లబండ్లతో బయలుదేరిన రైతులకు చివ్వేంల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయూతనందించారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభించిన జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఎద్దుల గ్రాసం కోసం ఐదు వేల రూపాయలను రైతులకు అందజేశారు.