ఒక రిజర్వ్ ఫారెస్టులో వెయ్యి హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. అందులో 200 హెక్టార్లలో మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలనుకున్నది. అప్పుడు ఏం చేయాలి? ఆ 200 హెక్టార్లు ఎక్కడ ఉన్నదో, దాని హద్దులేమిటో స్పష్టమైన సమాచారాన్ని నోటిఫికేషన్లో పొందుపరచాలి కదా! అయితే, ఇదేమీ జరుగలేదు. పైగా గతంలో అభియోగాలను ఎదుర్కొంటున్న సిమెంట్ కంపెనీలకే ఆ గనుల లీజు కూడా దక్కింది. దీంతో ఈ వ్యవహారం ఏదో అనుమానాస్పదంగా ఉన్నదంటూ ఓ సామాజిక కార్యకర్త.. అసలు టెండర్ ప్రక్రియ ఎలా జరిగిందన్న వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద గనుల శాఖను కోరాడు. అయితే, వ్యక్తుల ప్రాణాలకు హాని ఉన్నదంటూ గనుల శాఖ ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇదంతా చూస్తుంటే.. ఆ గనుల వేలం వెనుక ఏదో గూడుపుఠాణి ఉన్నదన్న అనుమానం ఎవరికైనా కలుగకమానదు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని సున్నపురాయి నిక్షేపాల మైనింగ్ లీజు వేలం ప్రక్రియ గురించే ఈ ఉపోద్ఘాతమంతా…
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గనుల శాఖ కొన్నిరోజుల కిందట సూర్యాపేటలోని మూడు సున్నపురాయి బ్లాక్‌లకు నిర్వహించిన ఈ-టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గనుల లీజుకు సంబంధించి గతంలో అభియోగాలు ఎదుర్కొంటున్న రెండు సిమెంటు కంపెనీలు ఈ మూడు బ్లాకుల్లో రెండు బ్లాకులను కైవసం చేసుకోవడం వెనుక ఏదో మతలబు దాగున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-టెండర్ నోటిఫికేషన్ మొదలు.. వేలం ముగిసిన తర్వాత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వరకు ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు తీవ్ర ఆరోపణలకు తావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎంఎండీఆర్ (గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం) నిబంధనలను తుంగలో తొక్కి.. హద్దులేవీ నిర్ణయించకుండానే లీజుకు సంబంధించిన వేలం నోటిఫికేషన్ జారీ చేయడం విమర్శలకు తావిస్తున్నది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్పూర్ అనే మూడు బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాల మైనింగ్ లీజు వేలంపై కేంద్రం అనుమతి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. వేలం వేసే గనుల సరిహద్దు మూలలను అక్షాంశాలు, రేఖాంశాలతో (డీజీపీఎస్ -డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం కార్నర్ పాయింట్లు) తెలుపుతూ ఈ-టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎంఎండీఆర్ చట్టం చెప్తుంది. కానీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కి సరిహద్దు మూలాలు లేకుండానే ప్రభుత్వం వెయ్యి హెక్టార్లలో ఓ రెండొందల హెక్టార్లు ఎక్కడ ఉన్నదనేది స్పష్టం చేయకుండానే ఈ-టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో లీజు దక్కించుకున్న సిమెంటు కంపెనీలను ‘ఇష్టానుసారంగా తవ్వుకోండి’ అని పచ్చజెండా ఊపినట్టా? లేకపోతే దాని వెనక ఇంకేదైనా మర్మం ఉందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. మూడు బ్లాకుల లీజుకు వేలం నిర్వహిస్తే… అందులో రెండు బ్లాకుల్లో గతంలోనే రెండు కంపెనీలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నాయని న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయి. తాజా టెండర్ ప్రక్రియలో అవే రెండు కంపెనీలు అవే బ్లాకులను మళ్లీ సొంతం చేసుకోవడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. మిగిలిన మూడో బ్లాకు మాత్రం పోటీ లేక రద్దు కావడం ఇక్కడ కొసమెరుపు. దీంతో కేవలం ఆ రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే కాకుండా అక్రమ మైనింగ్ అభియోగాల నుంచి వారిని కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ-టెండర్లలో ఎంఎండీఆర్ చట్టాన్ని ఉల్లంఘించిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
సమాచారం అడిగితే ప్రాణాలతో ముడి!
న్యాయస్థానాల్లో అక్రమ మైనింగ్‌పై కేసులు పెండింగులో ఉన్నప్పటికీ ప్రభుత్వం వేలం టెండర్ల ప్రక్రియను చేపట్టినందున సామాజిక కార్యకర్త వెంకట్‌రెడ్డి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అసలు టెండర్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో కోరినట్టుగా రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఖనిజాల మైనింగ్, అనుబంధ కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (న్యాయ) ఆర్.రామకృష్ణారెడ్డి సమాధానమిచ్చారు. కానీ వెంకట్‌రెడ్డి తన దరఖాస్తులో కోరిన టెండర్ల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తున్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్ తన లేఖలో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం-8(ఏ),(డీ),(ఈ), (జీ),(ఐ)నిఅనుసరించి సమాచారాన్ని బహిర్గతం చేయలేమని అందులో స్పష్టంచేశారు.
అయితే ఆర్టీఐ చట్టంలోని ఈ సెక్షన్లను పరిశీలించినపుడు క్లుప్తంగా ఒక వ్యక్తి ప్రాణాలకు హాని ఉన్నపుడు మాత్రమే సమాచారాన్ని బహిర్గతం చేయలేమని తేలింది. అంటే ఇప్పుడు సున్నపురాయి గనుల లీజు వేలం సమాచారాన్ని బయటపెడితే ఎవరి ప్రాణాలకు హాని కలుగుతుంది? ఎవరు హాని కల్పిస్తారు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లు అనేవి జనబాహుళ్యంలో ఉండాల్సినవి. పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన సమాచారాన్ని.. బయటపెడితే వ్యక్తుల ప్రాణాలకు ముప్పు అని చెప్పడం విడ్డూరం. కాగా సున్నపుగనుల టెండర్లలో ఇలాంటి విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో సామాజిక కార్యకర్త వెంకట్‌రెడ్డి ఈ వ్యవహారంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును నమోదు చేసుకొని పరిశీలిస్తున్నట్లు సీవీసీ స్పష్టం చేసింది.
ఎంఎండీఆర్ చట్టం ఏం చెప్తున్నది?
తొలి నుంచీ నిబంధనల ఉల్లంఘనే!
దేశవ్యాప్తంగా రాష్ర్టాల పరిధిలోని ఖనిజాల వేలం నిర్వహించేందుకుగాను చేపట్టే ఈ-టెండర్ల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం 2015లోనే గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్)ను రూపొందించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన గెజిట్ జారీ అయ్యింది. ఇందులో స్వల్ప మార్పులు చేస్తూ గత ఏడాది కూడా గెజిట్ విడుదలైంది. దీని ఆధారంగానే దేశంలోని రాష్ర్టాలన్నీ దాదాపుగా ఖనిజాల లీజు వేలం కోసం ఈ-టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. మొన్నటివరకు దేశంలోని 13 రాష్ర్టాలు ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియను నిర్వహించాయి. 14వ రాష్ట్రం గా తెలంగాణ గత ఏడాది ఆగస్టులో తొలిసారిగా ఈ-టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో కృష్ణా నదీ తీరం వెంట ఉన్న రిజర్వ్ ఫారెస్టులో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్పూర్ అనే మూడు బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాల మైనింగ్ లీజు వేలంపై కేంద్రం అనుమతి తీసుకున్న ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ 2024, ఆగస్టు 30న టెండర్ నోటిఫికేషన్ (నెం.226 3906/డీఎంఅండ్జీ-ఎంఐ/ఎల్ఎస్టీ/2023) జారీ చేసింది. బిడ్ల స్వీకరణ, పరిశీలన ఇలా పలు ప్రక్రియల తర్వాత నిరుడు నవంబరు చివరి వారంలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, రెండు సిమెంటు కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా జారీ చేశారు. కానీ నోటిఫికేషన్లోనే ఎంఎండీఆర్ చట్టంలోని కీలకమైన నిబంధనకు తిలోదకాలిచ్చారు.
చట్టానికి తూట్లు పొడిచిన క్రమం ఇదీ..
మూడో మనిషికి తెలిసేదెట్ల?
ఈ-టెండర్ నోటిఫికేషన్లోనే డీజీపీఎస్ కార్నర్ పాయింట్లను అక్షాంశాలు, రేఖాంశాలతో సహా ఇవ్వాల్సి ఉంది. దేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా పదమూడు రాష్ర్టాలు (మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, తమిళనాడు) 91 చోట్ల ఖనిజ నిక్షేపాల మైనింగ్ లీజు వేలం కోసం ఈ-టెండర్ల ప్రక్రియ చేపట్టాయి. ప్రతి రాష్ట్రం ఎంఎండీఆర్ చట్టానికి అనుగుణంగా అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు ఇచ్చాయి. టోపోషీట్లు సైతం నోటిఫికేషన్ సమయంలోనే అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా ఆన్లైన్లో టెండర్ నోటిఫికేషన్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆ మైనింగ్ బ్లాకు ఎక్కడ ఉన్నదనేది హద్దు మూలలతో సహా గూగుల్‌లో చూసినా తెలిసిపోతుంది. కానీ తొలిసారిగా ఈ-టెండర్ల ప్రక్రియ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్నర్ పాయింట్లు ఇవ్వకపోగా కనీసం ఆయా బ్లాకుల్లోని ఏ కంపార్ట్మెంట్ అనేది కూడా బహిర్గతం చేయకపోవడం ఏదో గూడుపుఠాణి జరిగిందనేందుకు నిదర్శనం.
ఈ-టెండర్ నోటిఫికేషన్‌లోని ‘ఖనిజ మైనింగ్ బ్లాక్ సారాంశం (సమ్మరీ)’ 1(2) కార్నర్ పాయింట్లు (లాటిట్యూడ్, లాంగిట్యూడ్) అనే కాలమ్‌లో ‘డీజీపీఎస్ కార్నర్ పాయింట్లను ‘అనుబంధం 1బి’లో ప్రచురించాం అని పేర్కొన్నారు. అంటే టెండరు నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు చెల్లించి బిడ్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వాటి వివరాలు ఇస్తామనేది దాని సారాంశంగా చెబుతున్నారు. కానీ అయినవారు కాకుండా కానివారు ఎవరైనా బిడ్ కొనుగోలు చేసినపుడైనా డీజీపీఎస్ కార్నర్పాయింట్లు ఇచ్చారా? లేదా? అనేది కూడా అంతుబట్టని అంశం. ఈ నేపథ్యంలో రిజర్వు ఫారెస్టులోని ఆ బ్లాకుపై పూర్తి అవగాహన ఉన్నవారికి మాత్రమే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. తద్వారా కొత్తవారు ఎవరూ ఈ టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు రారు. పైగా మైనింగ్ లీజు వేలం ఇస్తున్న విస్తీర్ణం పూర్తి బ్లాకు విస్తీర్ణంతో పోలిస్తే 7-16 శాతం వరకు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం చెప్తున్న ఆ ప్రాంతం ఎక్కడ, ఏ మూలకు ఉన్నది? వేలం దక్కించుకున్న కంపెనీలు ఎక్కడ మైనింగ్ చేయాలి? ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తే దానికి లెక్క, ప్రాతిపదిక ఏముంటుంది? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
అభియోగాలున్న వారికే ఆయా బ్లాకులు
కేంద్ర ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి ఉద్దేశపూర్వకంగానే సున్నపురాయి మైనింగ్ లీజు వేలం ఈ-టెండర్ల ప్రక్రియను నిర్వహించారనేందుకు మరింత బలాన్ని చేకూర్చేలా వివాదాస్పద సిమెంటు కంపెనీలే ఆయా బ్లాకుల్లో లీజు వేలాన్ని దక్కించుకోవడం గమనార్హం.
సైదుల్నామా బ్లాకులో దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఇష్టానుసారంగా సున్నపురాయి నిక్షేపాల్ని అనుమతి లేకుండా అక్రమ మైనింగ్ చేస్తుందని కోటేశ్వరరావు అనే సామాజిక కార్యకర్త గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి సుదీర్ఘంగా కేసు నడుస్తున్నది. అంటే సైదుల్నామా బ్లాకులోని రిజర్వు ఫారెస్టుపై దక్కన్ సిమెంట్స్ వారికి అవగాహన ఉన్నదనేది దీనిద్వారా స్పష్టమవుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ-టెండర్లలో దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ సరిగ్గా సైదుల్నామా బ్లాకుకు బిడ్లను వేసింది. మైనింగ్ లీజును దక్కించుకున్నది. మిగిలిన సుల్తాన్పూర్, పసుపులబోడు బ్లాకులపై ఆ కంపెనీ పెద్దగా ఆసక్తికనబర్చలేదని తెలుస్తున్నది.
అదేవిధంగా సుల్తాన్పూర్ బ్లాకులోని అటవీ ప్రాంతంలో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) వాళ్లు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని మరో సామాజిక కార్యకర్త వెంకట్‌రెడ్డి గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా ప్రస్తుతం పెండింగులోనే ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇదే అంశంపై ఫిర్యాదులు రావడంతో ప్రధానంగా సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్టులో అనుమతికి మించి సున్నపురాయి నిక్షేపాలను ఎన్సీఎల్ తవ్వుకొని వినియోగించుకుంటున్నదని రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఆ నివేదికలోని సిఫారసు మేరకు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ 2021లోనే ఆ కంపెనీకి రూ.91.42 కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే తాజా ఈ-టెండర్లలో ఎన్సీఎల్ సరిగ్గా ఇదే బ్లాకును దక్కించుకోవడం గమనార్హం. ఈ కంపెనీకి మిగిలిన రెండు పసుపులబోడు, సైదుల్నామా దక్కలేదంటే వాటిపై దృష్టి సారించలేదన్నమాటే కదా.
మిగిలిన పసుపులబోడు బ్లాకు విషయంలో మాత్రం నోటిఫికేషన్లో కంపార్ట్మెంట్-29 అని పేర్కొన్నారు. కానీ మూడు కంటే తక్కువ సాంకేతిక అర్హత ఉన్న బిడ్లు దాఖలైనందున నిబంధనల ప్రకారం ఈ బ్లాకు వేలాన్ని రద్దు చేస్తున్నట్టు గనులు, భూగర్భ శాఖ ప్రకటించింది. ఈ బ్లాకుకు సంబంధించి ఏ కంపెనీపైనా ఇప్పటివరకైతే అక్రమ మైనింగ్ వంటి అభియోగాలు లేవు. అందుకే ఈ బ్లాకు వేలం రద్దయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇలా రెండుచోట్ల అభియోగాలు ఎదుర్కొంటున్న సిమెంటు కంపెనీలకే లీజు వేలం దక్కడం ఒక అంశమైతే.. అక్రమ మైనింగ్‌పై న్యాయస్థానాల్లో కేసులు పెండింగులో ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటికి ఈ-టెండర్ల ప్రక్రియ నిర్వహించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నట్టయ్యింది.