సూర్యాపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమాని పచ్చని పంటలను పండించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి ఉన్న నీటి గోసను కేసీఆర్ సర్కార్ తీర్చింది. ఇక మంచిరోజులు వచ్చాయనుకున్న దశలో మాయమాటలు నమ్మినందుకు రైతన్నలు మళ్లీ ఉమ్మడి కాలం నాటి సాగునీటి గోసను ఎదుర్కోవాల్సి వచ్చింది. సాగుకు నీరు లేక… కరెంటు రాక.. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందివ్వక రైతులకు మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చింది ప్రస్తుత సర్కార్. కాగా జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో కాలువల ద్వారా 2.50 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం కాగా, చెరువులు, కుంటల కింద మరో 45వేల ఎకరాలు కలిపి 2.95 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం 2017 యాసంగి సీజన్లో సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో కేవలం 17,500 ఎకరాల్లో వరి పండించగా, కాళేశ్వరం జలాలు ప్రారంభం కావడంతో 2.95 లక్షల ఎకరాల్లో పంటలు వేశారంటే మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సీజన్లో ఇప్పటికే రైతాంగం దుక్కులు దున్ని 80శాతం నాట్లు వేయాల్సి ఉంది. ఇప్ప టి వరకు జిల్లాలో నాట్లు వేయడం ఒక్క శాతం కూడా పూర్తి కాలేదు. కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర సర్కార్ పడావు పెట్టేసింది. దీంతో ఈ సీజన్లో సూర్యాపేట జిల్లా లో 2.95 లక్షల ఎకరాలకు గాను బోర్లు, బావు ల కింద కేవలం 2వేల ఎకరాలకు మించి నాట్లు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఇస్తుందనే నమ్మకం లేక వరి నార్లు వేసేందుకు కూడా రైతాంగం వెనుకాడుతున్నది.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడేనికి చెందిన వెంకటేశ్‌కు ఐదెకరాల భూమి ఉన్నది. ఏటా కడెం ప్రాజెక్టు నీటిపై ఆధారపడి సాగుచేస్తున్నాడు. ఇటీవల నారు మడి పోయగా, వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది.

గురువారం ట్రాక్టర్ ట్రాలీలో నీరు తెచ్చి నారు మడికి చల్లుతూ బతికించుకునే ప్రయత్నం చేశాడు.
వర్షాలు సమృద్ధిగా కురువాలని కోరుతూ నిర్మల్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్, ఎంపల్లి గ్రామాల్లో ఆదివాసీలు వనదేవతకు పూజలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్, బజార్హత్నూర్, మంచిర్యాల జిల్లా బలరావ్పేటలో కప్పతల్లి ఆట ఆడారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తలోడి, తదితర గ్రామాల్లో జలాభిషేకాలు నిర్వహించారు.
పోలీసుల ఆంక్షలను దాటుకొని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాకాల తూము గేట్లను ఎత్తారు. గురువారం ఖానాపురం నుంచి 200 బైక్‌లతో బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీ ర్యాలీగా పాకాల సరస్సు వద్దకు చేరుకున్నారు.

పోలీసులను ఛేదించుకుంటూ పాకాల తూము గేట్లను తెరిచి సాగు నీటిని విడుదల చేశారు. అక్కడే బైఠాయించిన రైతులు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేరు) ద్వారా సాగునీటిని అందించాలని రైతులు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరులోని మానేరు బ్రిడ్జిపై ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కందికట్కూర్,

బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల రైతులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌస్ నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.