హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ‘గోల్డ్ మెన్’పై దృష్టి సారించిన ఐటీ అధికారులకు విస్తుపోయే నిజం తెలిసింది. అత్తాపూర్‌కు చెందిన 34 ఏండ్ల సూర్య భాయ్ అలియాస్ పల్లపు సురేశ్‌కుమార్ ధరించే నగల్లో మెరుపు ఉందే తప్ప, అసలు బంగారం లేదని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసును విచారిస్తున్న అధికారులకు, సూర్యాభాయ్ గురించి సమాచారం అందింది. ఐటీ విచారణకు హాజరైన సూర్యాభాయ్ సుమారు రూ.1 కోటి విలువైన 12 రకాల ఆభరణాలు ధరించి వచ్చారు. ఈ క్రమంలో అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం ఇచ్చిన అధికారులు ఆభరణాలను పరీక్షించగా, ఆ నగలు కేవలం రూ.3 లక్షల విలువైనవిగా, రాగి, వెండిపై గోల్డ్ కోటింగ్ చేశారని తేల్చారు. ఇలాంటివి దాదాపు 32 సెట్లను ఆయన వాడుతున్నట్టు గుర్తించారు. తన పేరు మీద గానీ, భార్య పేరు మీద గానీ స్థిరాస్తులు లేవని, నెలకు రూ. 20,000 అద్దె ఇంట్లో నివసిస్తున్నారని అధికారులు ధ్రువీకరించారు.