Saailu Kaampati | ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు సాయిలు కాంపాటి తన రెండో చిత్రానికి సిద్ధమవుతున్నాడు. గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలవడంతో సాయిలు పేరు ఇండస్ట్రీలో ఒక్కసారిగా మార్మోగింది. తెలంగాణ నేటివిటీ, సహజమైన పాత్రలు, భావోద్వేగాలతో కూడిన కథను తెరపై అందించిన ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తొలి విజయంతో జోష్‌లో ఉన్న ఈ దర్శకుడు తన రెండో సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలుస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం సాయిలు కాంపాటి తన రెండో చిత్రానికి ‘బబ్లూ XXL’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ టైటిల్ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా కథకు తగ్గట్టుగానే ఈ పేరును ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో యువ నటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ‘మెమ్ ఫేమస్’ సినిమాతో నటుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్‌కు ఈ కథ నచ్చినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన పేరే ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. దర్శకుడు సాయిలు కాంపాటి తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథను మొదట సుమంత్ ప్రభాస్‌కే వినిపించారట. అయితే, అప్పటికే ‘మెమ్ ఫేమస్’ సినిమాలో తెలంగాణ నేపథ్యంలో నటించిన సుమంత్, వరుసగా మరో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథ చేయకూడదనే ఉద్దేశంతో ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత అదే కథతో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుని స్లీపర్ హిట్‌గా నిలిచింది. లీజా సమాచారం ప్రకారం సాయిలు కాంపాటి రెండో సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో సాగే ప్రేమకథగానే ఉండబోతోందట. అయితే ఈసారి కథ, పాత్రలు, ఎమోషన్స్ మరింత కొత్తగా ఉండేలా దర్శకుడు స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు ఏషియన్ సునీల్, పుష్కూర్ రామ్మోహన్ రావు, భరత్ నరంగ్ సంయుక్తంగా SVCLLP బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం.