పెద్దపల్లి, ఆగస్టు 31: పెద్దపల్లి జిల్లాలో 31 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల లైసెన్స్‌లు రద్దుచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో లైసెన్స్డ్ సర్వేయర్లు ర్యాలీ తీసి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. లైసెన్స్‌ల రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించి, సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. వీరికి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మద్దతు తెలిపారు. అనంతరం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నగర రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్ మాట్లాడారు.
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అర్హులైన 6,500 మందికి ప్రభుత్వం శిక్షణ ఇప్పించగా.. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్‌లు పొందామని పేర్కొన్నారు. అప్పుడు గుంట నుంచి 2 ఎకరాలలోపు భూ సర్వే చేస్తే రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఎకరానికి రూ.60 మాత్రమే ఇస్తామని ప్రకటించడం అన్యాయమని వాపోయారు. ఎకరాల చొప్పున కాకుండా గౌరవ వేతనం ప్రకటించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.