యాచారం, ఏప్రిల్ 16 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మా భూముల సర్వే ముమ్మరంగా కొనసాగతున్నది. తాటిపర్తి గ్రామంలో ఉన్న ఎడ్ల కంచ భూములను బుధవారం రెవెన్యూ, ఫారెస్టు అధికారుల సమక్షంలో సర్వే చేశారు. తహసీల్దార్ అయ్యప్ప పర్యవేక్షణలో ఆర్ఐలు మురళీకృష్ణ, రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే చేపట్టారు. గ్రామంలోని 109, 114 సర్వే నంబర్లలోని భూములను రికార్డుల పరంగా కొలతలేసి సర్వే చేశారు. ఫారెస్టు, రెవెన్యూ భూముల సరిహద్దులను మ్యాపు ఆధారంగా గుర్తించారు.
ఇటీవల ఫార్మా భూములకు అధికారులు ఫెన్సింగ్ వేస్తుండగా సర్వే నంబర్ 104లో గల హద్దురాళ్లు 109, 114 సర్వే నంబర్లలోకి వచ్చాయి. ఆ భూములకు హద్దులు గుర్తించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఫారెస్టు, రెవెన్యూ భూములకు సంబంధించిన సరిహద్దుల గుర్తింపులో తేడా రావడంతో 56 కుటుంబాలకు చెందిన 516 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నట్టు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు చేపట్టిన ఫెన్సింగ్ పనులను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ రాజు బాధిత రైతులతో మంగళవారం సమవేశమయ్యారు.
ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ భూముల్లో పక్కాగా సర్వే చేశారు. ఎడ్ల కంచ భూములను సర్వే చేపట్టిన అధికారులు ఎక్కడెక్కడ, ఎవరెవరు రైతులు కబ్జాలో ఉన్నారో తేల్చారు. భూముల విషయంలో రైతులు ఏమాత్రం అధైర్య పడొద్దని, వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. ఎడ్ల కంచ భూముల సర్వేను పూర్తి స్థాయిలో చేపట్టి ఫారెస్టు, రెవెన్యూ భూములకు సరిహద్దులను గుర్తిస్తామని చెప్పారు. ఎడ్ల కంచ భూముల సమస్యను పరిష్కరించిన తర్వాతే ఫార్మా భూములకు ఫెన్సింగ్ వేసే పనులను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఫార్మా ప్లాట్లను వెంటనే డ్రా తీసి కబ్జా చూపించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి గ్రామాల్లో ఫార్మా భూముల ఫెన్సింగ్ పనులను టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య మూడు బృందాలుగా ఏర్పడి కొనసాగిస్తున్నారు. ఫారెస్టు, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులు నిరంజన్, కుందారపు సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.