Caste Census | హైదరాబాద్ సిటీబ్యూరో/జవహర్‌నగర్ /తార్నాక, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ): కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న కులగణన సర్వే మొక్కుబడిగా జరుగుతున్నది. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆచరణలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నది. సర్వే పత్రాలు రోడ్లపై చిత్తు కాగితాలుగా దర్శనమిస్తున్నాయి. సర్వేకు ప్రజలు అందించిన సహకారాన్ని ప్రభుత్వం హేళన చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నది.
కులగణన సర్వేలో అధికారుల వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల వివరాల సేకరించి కార్యాలయాల్లో భద్రంగా దాచాల్సిన కీలక పత్రాలను రోడ్డున పడేస్తున్నది. ఈ నెల 13న మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పూరించని కుటుంబ సర్వే ఫారాలు జాతీయ రహదారిపై దర్శనమిచ్చాయి. ఓ ఘటన జరిగిన త ర్వాత అయినా జాగ్రత్త పడాల్సిన అధికారులు మళ్లీ అదే నిర్లక్ష్యం పునరావృతం చేశారు. మే డ్చల్ జిల్లా తార్నాకలో పూరించిన సర్వే పత్రా లు రోడ్డుపై దర్శనమిచ్చాయి. ఇవి కాప్రా మం డలం డివిజన్ 27 భక్తబాయికాలనీకి చెందిన కుటుంబాల సర్వే పత్రాలుగా స్థానికులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పత్రాలను ఎన్యూమరేటర్ నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నట్టు తెలుస్తున్నది. సర్వే పత్రాలు రోడ్డుపై దర్శనమివ్వడంపై జవహర్‌నగర్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ వివరణ కోరగా నాకేం తెల్వదు అంటూ ఫోన్ కట్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి ఆర్భాటపు ప్రకటనలతో రాగానే ప్రజలను ఆకట్టుకునే ప్ర యత్నం చేసింది. ప్రజాపాలన అంటూ దరఖాస్తులు తీసుకుంది. ఆ పత్రాలు రోడ్లపై, బా ర్లలో పొట్లాలు కట్టే కాగితాల్లో, చెత్తలో కనిపించాయి. ఇప్పుడు కులగణను పత్రాలు కూడా రోడ్లపైకే చేరుతున్నాయి. ప్రజలు చాలా సమ యం కేటాయించి, ఓపికగా సర్వేకు సహకరిస్తున్నారు. వ్యక్తిగత వివరాలను రోడ్డు పడేయ డం దారుణమని ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శనం. తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బయట పడేయడమే మీ సర్వే లక్ష్యమా? సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతున్నది. ఈ వివరాలు సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఉంది. ఈ ఘటన పట్ల ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలి. ప్రజల వివరాలకు భద్రత కల్పించాలి.
– హరీశ్‌రావు, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే