హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ పీ రఘురాం మరో ఘనత సాధించారు. ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఇచ్చింది. తద్వారా ఏఎస్ఐ 83 ఏండ్ల చరిత్రలో ఈ అవార్డు సాధించిన పిన్న వయస్కుడిగా రఘురాం రికార్డు సాధించారు. ఏఎస్ఐ అనేది భారతదేశంతోపాటు ఆసియా-పసిఫిక్లలోనే అతిపెద్ద సర్జన్ల సంఘం. ప్రపంచంలోనే రెండో పెద్ద సంఘంగా గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరుగుతున్న 83వ వార్షిక సదస్సులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును డాక్టర్ రఘురాంకు అందజేశారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా సుమారు 6 వేల మంది సర్జన్లు హాజరయ్యారు. బుధవారం ప్రారంభమైన ఈ సదస్సు 16వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. డాక్టర్ రఘురాం తన నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని అభినందించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందజేసిందని, ప్రతిష్ఠాత్మక డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు కూడా ఆయన సాధించారని గుర్తు చేశారు. ఆయన దేశ, విదేశాల్లో అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని అభినందించారు. డాక్టర్ రఘురాంతోపాటు విజయవాడకు చెందిన డాక్టర్ కే పట్టాభిరామయ్యకు కూడా లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది.