హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామ శివారులోని 106.34 ఎకరాల భూమి విషయంలో అటవీ శాఖకు 39 ఏండ్ల తర్వాత ఊరట లభించింది. ఆ భూమి అటవీ శాఖదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సర్వేనెంబర్ 171లో ఉన్న ఆ భూమిపై హక్కును కోరుతూ గతంలో పిటిషన్ వేసిన మహ్మద్ అబ్దుల్ఖాసిం అనే వ్యక్తికి 1994లో వరంగల్ జిల్లా కోర్టులో, 2018లో హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన ఆయనకు అనుకూలంగా 2021 మార్చిలో హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ అటవీశాఖ 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. ఆ 106.34 ఎకరాల భూమి అటవీశాఖదేనని తేల్చిచెప్పింది. ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేసిన రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అధికారులు స్పష్టమైన వైఖరితో వ్యవహరించనందున రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రతివాదికి రూ.5 లక్షల చొప్పున జరిమాన విధిస్తున్నట్లు వెల్లడించింది. ఆ మొత్తాన్ని రెండు నెలల్లోగా జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.