హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో తనపై నమోదైన అక్రమ కేసును కొట్టేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్‌పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం బుధవారం విచారణ జరుపనుంది. ఈ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానంలో 37వ నంబర్‌గా లిస్ట్ అయింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, కేటీఆర్ కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం అందులో కోరింది.