హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి గొంతు నొకాలనే రాష్ట్ర ప్రభుత్వ కుట్రను సుప్రీంకోర్టు అడ్డుకున్నది. ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావులేదనే ధోరణిలో పోలీసులు పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసినా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొండి పట్టుదలతో సుప్రీంకోర్టుకు వెళ్లి ఓడిపోయింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్‌గౌడ్ (నల్ల బాలు)పై పెట్టిన కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సోషల్ మీడియా పోస్టు ఆధారంగా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనన్న హైకోర్టు తీర్పును ఆమోదించింది.
శశిధర్‌ను అక్రమ కేసులో పోలీసులు అరెస్టు చేశారని హైకోర్టు తేల్చి చెప్తూ వెలువరించిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిన ఒక ట్వీట్‌ను బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్‌గా ఉన్న శశిధర్‌గౌడ్ రీట్వీట్ చేశారు. దీని ఆధారంగా రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. పోలీసుల చర్యను తెలంగాణ హైకోర్టు 2025 సెప్టెంబర్‌లో తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు నమోదు, అరెస్టులు చట్ట విరుద్ధమని తేల్చింది. శశిధర్‌పై నమోదు చేసిన కేసును రద్దుచేస్తూ తీర్పు వెలువరించింది. సోషల్‌మీడియా పోస్టులను సాకుగాచూపి అక్రమకేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించే ధోరణిని అరికట్టాలని రాష్ట్ర పోలీస్ శాఖకు మార్గదర్శకాలు జారీచేసింది.
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోం
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. శశిధర్‌పై నమోదైన కేసుల విషయంలో రాష్ట్ర పోలీసుల అత్యుత్సాహం, అక్రమ అరెస్టుల తీరు కొనసాగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. సోషల్ మీడియా వేదికపై ఒక రాజకీయ పార్టీ ట్వీట్‌ను రీట్వీట్ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టడం చట్టబద్ధం కాదన్న హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. శశిధర్‌పై నమోదైన అన్ని కేసులను హైకోర్టు కొట్టివేయడాన్ని సమర్థించింది. సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించే చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని హైకోర్టు పేరొన్నదని గుర్తుచేసింది. ఈ తరహా చర్యలు పునరావృతం కాకుండా హైకోర్టు రాష్ట్ర పోలీస్ శాఖకు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని చెప్పింది. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని గుర్తుచేసింది. శశిధర్ అరెస్ట్ విషయంలో పోలీసుల చర్యలు చట్ట పరిధిని అతిక్రమించాయన్న హైకోర్టు పరిశీలనను సుప్రీంకోర్టు సమర్థించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయిందని న్యాయ నిపుణులు, సోషల్ మీడియా వర్గాలు చెప్తున్నాయి.
హైకోర్టు తీర్పులో ఏమున్నదంటే?
సోషల్ మీడియా పోస్టులు పెట్టిన నల్ల బాలుపై పోలీసులు మూడు కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ నిరుడు సెప్టెంబర్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుకారాంజీ తీర్పు వెలువరించారు. ఇందులోని కీలక విషయాలను గమనిస్తే.. ‘ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కేసు నమోదు చేయాలి. పదునైన రాజకీయ విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలతో పోస్టులు ఉన్నాయని చెప్పి క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీల్లేదు’ అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల విషయంలో అనుసరించాల్సిన విధానంపై పోలీసులు, మెజిస్ట్రేట్లకు ధర్మాసనం మార్గదర్శకాలు జారీచేసింది. ‘చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోని పోస్టులపై రాజకీయ ఫిర్యాదులు వస్తే వాటిని పనికిమాలినవిగా పరిగణించాలి. ప్రాథమిక హకుల పరిరక్షణ కీలకం. కేసుల నమోదు, విచారణ ఏకపక్షంగా జరుగకూడదు.
రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన ప్రాథమిక హకులకు భంగం కలిగించేలా చర్యలు తీసుకోడానికి వీల్లేదు’ అని స్పష్టం చేసింది. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారని చెప్పి కేసు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు చేసినందుకు కేసులు పెడుతామంటే చెల్లుబాటు కాదని స్పష్టంచేసింది. సదరు పోస్టుల వల్ల ఎవరికి నష్టం జరిగిందో చట్టపరంగా సమీక్ష చేయకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చెల్లదని తెలిపింది. ‘సీఎంకు వ్యతిరేకంగా చేసిన పోస్టుతో మనోభావాలు దెబ్బతిన్నాయని పేరొంటూ అసత్య పునాదులపై కేసులు కొనసాగించడానికి వీళ్లేదు. సీఎం పరువుపోతే.. ఆయనే నేరుగా ఫిర్యాదు చేయాలి. తమ నాయకుడైన సీఎం పరువు పోయిందని మూడో వ్యక్తి ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా కేసు నమోదు చేయడం చెల్లదు’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘రాజకీయ విమర్శలు కఠినంగా లేదా ఘాటుగా ఉన్నప్పటికీ అవన్నీ వ్యక్తి స్వేచ్ఛ హకులోకి వస్తాయి. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం కింద భారత పౌరుడికి లభించిన వ్యక్తిగత స్వేచ్ఛలోకి వస్తుంది. హింస, అల్లర్లు, దురుద్దేశపూర్వక ప్రేరణ వంటి చర్యలకు దోహదపడే విమర్శలు కావు’ అని అభిప్రాయపడింది.
నల్లబాలుపై రామగుండం, కరీంనగర్, జీడీకే-వన్‌టౌన్ పోలీసుస్టేషన్లల్లో నమోదైన కేసులు చెల్లవని ఆదేశించింది. హింసను ప్రేరేపించే విధంగా పోస్టు ఉంటే కేసు నమోదు చేయవచ్చని చెప్పింది. నిందితుడిని అరెస్టు చేసే ముందు సుప్రీంకోర్టు ఆర్నేశ్కుమార్ కేసులో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని స్పష్టంచేసింది. పరువునష్టం, విద్వేష ప్రసంగం, హింస, సామాజిక అశాంతి వంటి ఆరోపణలను నిరూపించేలా ఆధారాలు ఉంటేనే కేసు కొనసాగించాలని తెలిపింది. రాజ్యాంగంలోని 19(1) (ఏ) అధికరణ ప్రకారం.. సాధారణ రాజకీయ విమర్శలకు రక్షణ ఉన్నదని, పరువు నష్టం వాటిల్లిందని చెప్పి పోలీసులు నేరుగా కేసులు నమోదు చేయడానికి వీల్లేదని పేర్కొన్నది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని, బీఎస్‌ఎస్‌ఎస్ సెక్షన్ 174(2) కింద మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే పోలీసులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని సూచించింది. రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులు పనికిమాలినవని నిర్ధారణకు వస్తే, దర్యాప్తునకు కారణాలు లేవని చెప్పి ఆ కేసును మూసేయాలని హైకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది.