సెక్స్‌వర్కర్ల కు అన్ని కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
వాటికి వృత్తితో సంబంధం లేదు
సెక్స్‌వర్కర్లకు అన్ని కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: వృత్తితో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కులు హామీ ఇచ్చిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు తక్షణం ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు జారీచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే సమయంలో మునుపటి ఉత్తర్వులకు అనుగుణంగా గుర్తింపు కార్డుల కోసం పట్టుబట్టకుండా వారికి రేషన్ ఇవ్వడాన్ని కొనసాగించాలని పేర్కొన్నది. కార్డుల జారీపై నాలుగు వారాల తర్వాత స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సూచించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో సెక్స్ వర్కర్లు పడిన ఇబ్బందులను పేర్కొంటూ ‘దర్బార్ మహిళా సమన్వయ కమిటీ’ అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని 2011లో జారీ చేసిన ఆదేశాలు అమలుకు నోచుకోకపోవడంపై ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. దేశంలోని ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.