– వ్యర్థ జలాల విడుదలతో పారిశ్రామికవాడ ప్రజల ఆందోళన
– గోదావరి నదిలో కలిస్తే ప్రజారోగ్యంపై ప్రభావం
– సారపాక సర్పంచ్ ఫిర్యాదుతో రంగంలోకి పొల్లూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు
బూర్గంపహాడ్, అక్టోబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ పంచాయతీలో ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారం నుండి వ్యర్థ జలాలు విడుదల చేస్తుండడంతో సర్పంచ్ తో పాటు మేజర్ పంచాయతీలో 4వ వార్డు(బసప్పక్యాంపు) ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఐటీసీ కర్మాగారం నుండి భారీగా వ్యర్థజలాలు (కలుషిత జలాలు) విడుదల చేయడంతో ఈ నీటి నుండి పెద్ద ఎత్తున దుర్గంధం వెలువడటంతో వార్డు ప్రజలు ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయని సర్పంచ్, పాలకవర్గానికి ప్రజలు సమాచారమిచ్చారు. హుటాహుటీన సర్పంచ్, పాలకవర్గం అక్కడకు చేరుకుని కలుషిత జలాలను పరిశీలించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కాలుష్య నియంత్రణ మండలి) ఈఈ, ఏఈలకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడకు చేరుకుని శాంపిల్స్ సేకరించారు. ఐటీసీ నుండి వెలువడిన వ్యర్థ జలాలు సైడ్ డ్రైన్ల ద్వారా ప్రవహిస్తుండటాన్ని పరిశీలించి ప్రజల ఆరోగ్యంపై ఈ వ్యర్థ జలాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘ప్రజల ప్రాణాలతో ఐటీసీ చెలగాటం’
ఈ వ్యర్థ జలాలు బసప్పక్యాంప్, గాంధీనగర్ నుండి గోదావరిలో కలుస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు వ్యర్ధ నీటి నమూనాలను సేకరించి రసాయనాల స్వభాగం, కాలుష్య స్థాయి శాస్త్రీయంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని, సేకరించిన నమూనా ఫలితాలను ప్రజలకు అధికారులు వెల్లడించాలని సర్పంచ్, స్థానికులు పేర్కొంటున్నారు. సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ ఐటీసీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, కలుషిత జలాల ప్రభావంతో పట్టుమని పది నిముషాలు కూడా అక్కడ ఉండే పరిస్థితిలేదని, విపరీతమైన దుర్గంధం వెదజల్లుతుందని, కలుషిత జలాలపై తక్షణమే యాజమాన్యం స్పందించి వ్యర్ధ జలాలు నియంత్రించే చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని హెచ్చరించారు. అంతేకాకుండా సారపాకలో ప్రజలకు ఆరోగ్యసేవలు అందించేలా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని ఇప్పటికే ఐటీసీకి మూడుసార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని, కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఐటీసీ వారి బాగోగులు కూడా చూడాల్సిన అవసరం ఉందని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, ఈవో గుగులోత్ రవికుమార్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

‘ప్రజల ప్రాణాలతో ఐటీసీ చెలగాటం’