బూర్గంపహాడ్, అక్టోబర్ 05 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. బుడ్డగూడెం పరిసర ప్రాంతాల్లో కిన్నెరసాని వాగు నుండి ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా జరుగుతున్నా తనిఖీలు చేయడంలో, చర్యలు తీసుకోవడంలో అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రాత్రి వేళల్లో బుడ్డగూడెం పరిసర ప్రాంతాల్లో ట్రాక్టర్లు, భారీ వాహనాలు పెద్ద సంఖ్యలో అక్రమ ఇసుక రవాణాతో రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. బుడ్డగూడెంలో ఇద్దరు వ్యక్తులు అక్రమ ఇసుక వ్యాపారాన్ని యధేచ్ఛగా నిర్వహిస్తూ ఎవరైతే మాకేంటి, తమ వ్యాపారానికి అడ్డూ అదుపూ లేదంటూ ఇసుక వ్యాపారంలో లక్షలు గడిస్తున్నారు. అక్రమ ఇసుక వ్యాపారం వల్ల రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్ధాలతో వాహనాల రాకపోకలు సాగుతున్నాయని, వాహన రాకపోకలతో దుమ్ము, ధూళీ లేచి గ్రామాల్లో స్థానికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. గ్రామీణ రహదారులు సైతం దెబ్బతింటున్నాయని, అక్రమ ఇసుక వ్యాపారంపై అధికారులు స్పందించి ఇసుకాసురులపై కఠినచర్యలు తీసుకోవాలని బుడ్డగూడెం పరిసర ప్రాంతవాసులు వేడుకుంటున్నారు.