– బూర్గంపహాడ్ ప్రజల వేడుకోలు
బూర్గంపహాడ్, అక్టోబర్ 05 : బూర్గంపహాడ్‌లో వీధి కుక్కలు, కోతుల నుండి కాపాడాలంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ వీధిలో కుక్కలు, కోతుల సంచారం రోజురోజుకు పెరిగిపోతుండడంతో ప్రజలు, ఆయా పాఠశాలలు, వసతి గృహాలకు వెళ్లే విద్యార్ధినీ, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాల-2 వీధి, పెద్దమసీదు బజారు, చిన్నమసీదు, ప్రెస్ క్లబ్ బజార్లతో పాటు పలు ఏరియాల్లో కుక్కల బెడద విపరీతంగా ఉందని, మరోపక్క కోతులు సైతం ప్రజలపై దాడులు చేస్తున్నాయని, చిన్నారులను సైతం తల్లిదండ్రులు వీటి బెడదతో బడులకు సైతం పంపలేకపోతున్నట్లు వాపోతున్నారు. పంచాయతీ పాలకవర్గం, సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను నిర్మూలించి, కోతులను సమీప అటవీ ప్రాంతాల్లో వదిలి వేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.