హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): బార్ అండ్ బెంచ్ సమాంతరమైన రైలు పట్టాల్లాంటివని, నాణేనికి బొమ్మ, బొరుసులా ఇవి రెండూ కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆయనను తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ శుక్రవారం ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. హైకోర్టు ఆవరణలోకి రాగానే గత జ్ఞాపకాలు మదిలో మెదిలాయని తెలిపారు. న్యాయవాదిగా 20 ఏండ్లు, న్యాయమూర్తిగా 11 ఏండ్లు హైకోర్టుతో తనకు అనుబంధం ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పీ నవీన్‌రావు, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్, ఉపాధ్యక్షుడు పాశం కృష్ణారెడ్డి, కార్యదర్శులు గాడిపల్లి మల్లారెడ్డి, జల్లి నరేందర్, స్పోర్ట్స్ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.