హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బీఆర్ఎస్ మొదటి నుంచీ ఆందోళనలను గట్టిగా వినిపించిందని గుర్తుచేశారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తుందని వివరించారు. వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపై తాము పోరాడామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ దేశంలోని మతసామరస్య వాతావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా దేశ ఐక్యత ముఖ్యమని తాము విశ్వసిస్తామని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు పూర్తి శక్తితో పోరాడారని, భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడు దేశ సమగ్రత కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలో ఒక మత ఘర్షణ కూడా జరగలేదన్నారు. ఇది తమ పాలనా నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో షాదీ ముబారక్, రంజాన్తోఫా పథకాలను రూపొందించి, అమలు చేశామని గుర్తుచేశారు. ఈ పథకాలు తమ హయాంలో మైనారిటీలకు చాలా లబ్ధి చేకూర్చాయని తెలిపారు.