ములుగు, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇటీవల రామప్ప ఆలయం వర్షాలకు కురవడం, గొల్లగుడిని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి గుప్తనిధుల కోసం శివలింగాన్ని తొలగించడం బాధాకరమని చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను పాటించకుండా సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులు చేపడితే ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ(టీజీహెచ్సీఎల్) ఉద్యోగులు తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. వారి డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన మొత్తం 242 మంది రెగ్యులర్ ఉద్యోగులు డిప్యూటేషన్‌పై వివిధ శాఖల్లో పనిచేస్తుండగా, అందులో కలెక్టర్ ఆఫీసుల్లో పనిచేస్తున్న 148 మంది, టీజీఆర్ఎస్సీఎల్లో పనిచేస్తున్న 9 మంది మినహా మిగిలినవారు తమ సొంత శాఖకు బదిలీ అయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.