MLAs Defamation | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు చేరినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ఈ నెల 4న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్పీకర్‌కు నోటీసులు జారీచేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఆ నోటీసులను నేరుగా తామే ఇస్తామని, హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేస్తామని, పిటిషనర్లు కూడా నేరుగా కలిసి ఇవ్వొచ్చని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసులు స్పీకర్‌కు చేరినట్టు తెలిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎన్ని రోజుల్లోగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నోటీసులకు ఈ నెల 25 లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు నుంచి తొలిసారి స్పీకర్‌కు నేరుగా నోటీసులు రావడంతో ఆయన ఎలా స్పందిస్తారనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయనిపుణులతో సంప్రదించి, కోర్టుకు సమాధానం ఇవ్వనున్నట్టు తెలిసింది. కాగా, సుప్రీంకోర్టు నోటీసులపై శాసనసభ కార్యదర్శిని, ఆయన కార్యాలయాన్ని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా.. ఎలాంటి సమాధానం రాలేదు.
పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని గమనిస్తే ఒక పార్టీలో గెలిచి మరోపార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధుల పట్ల కోర్టు కఠిన వైఖరి అవలంబిస్తున్నట్టు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వేగంగా తుది నిర్ణయం తీసుకునేలా సుప్రీంకోర్టు ఒత్తిడి తెస్తున్నదని భావిస్తున్నారు. ఇదే జరిగితే తమ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలు వస్తే తాము గెలవడం కష్టమేనని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పదవి పోయి, ఇటు గౌరవం పోయి రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతామేమోనని వారు మథనపడుతున్నట్టు సమాచారం.