సీఎం రేవంత్‌రెడ్డికి పదవీకాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని సుప్రీంకోర్టు సాక్షిగా రుజువైంది. బీఆర్ఎస్ మొదటినుంచీ చెప్తున్నట్టుగానే చంద్రబాబుకు గురుదక్షిణ కోసమే రేవంత్ ఏపీ అక్రమ ప్రాజెక్టులకు సహకరిస్తున్నరు. గోదావరి-బనకచర్లపై సోమవారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సూట్లో ప్రొసీజర్ ల్యాప్స్ ఉన్నాయని, సరిగ్గా ఫైల్ చేయలేదని న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం వేసే సూట్స్‌లో లోపాలు ఉంటయా?, లోపాలున్నవి ఎందుకు వేశారో? రేవంత్, ఉత్తమ్ సమాధానం చెప్పాలి.
– హరీశ్‌రావు
సంగారెడ్డి జూలై 13(నమస్తే తెలంగాణ): గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన సూట్ లోపభూయిష్టంగా ఉన్నదంటూ సుప్రీంకోర్టు డిస్మిస్ చేయటంతో రేవంత్‌రెడ్డి-చంద్రబాబు చీకటి ఒప్పందం బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టులో సరైన సూట్ వేయటంలో కూడా రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
గోదావరి-బనకచర్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రాగా తెలంగాణ ప్రభుత్వం వేసిన సూట్లో ప్రొసీజర్‌లో ల్యాప్స్ ఉన్నాయని, ప్రభుత్వం సూట్ కూడా సరిగ్గా ఫైల్ చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మొట్టికాయలు వేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చుచేసి సుప్రీంకోర్టులో నియమించుకున్న లాయర్లు, ఏజీ, ఉన్నతాధికారులు సరైన సూట్ వేయకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గోదావరి జలాల కేసు ఉన్నప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, న్యాయశాఖ మంత్రి అధికారులతో ఎందుకు సమీక్ష జరుపలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎంతసేపూ బీఆర్ఎస్ను తిట్టడంలో బిజీగా ఉన్నారే తప్ప సుప్రీంలో వేసే సూట్ గురించి ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. తన గురువు చంద్రబాబు కండ్లల్లో ఆనందం కోసమే సుప్రీంకోర్టులో లోపభూయిష్టమైన సూట్ వేశారని విరుచుకుపడ్డారు. గోదావరి జలాల కేటాయింపులు, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబుకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణ ద్రోహి మాత్రమే కాదని తెలంగాణ పాలిట జలద్రోహిగా మారారని నిప్పులుచెరిగారు. సోమవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. గోదావరి-బనకచర్ల, గోదావరి-నల్లమల్లసాగర్, సీడబ్లూసీలో డీపీఆర్ పరిశీలన జరుగటం తదితర అంశాలను బీఆర్ఎస్ మొదట బయటకు తీసుకొచ్చిందని చెప్పారు.
నీటి హక్కులు, ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించాలి
కర్ణాటకలో ముగ్గురు సీఎంల మధ్య జరిగిన రహస్య సమావేశం ఏజెండాను వెంటనే బయటపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సుజలాం-సుఫలాం పేరుతో కర్ణాటక, ఆంధప్రదేశ్‌కు లాభం జరిగితే తెలంగాణకు నిష్ఫలమేనని చెప్పారు. తెలంగాణ గుండా రావాల్సిన ఇంటర్‌లింకింగ్ రివర్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి కాకుండా పోలవరం బనచర్ల ద్వారా గ్రాండ్ ఆనకట్టకు పోతుందన్నారు. ఇదే జరిగితే సమ్మక్క బ్యారేజీ వద్ద 47 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉందని ఇంకా 130 టీఎంసీలకు ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు 45 టీఎంసీలు, పోలవరం డైవర్షన్‌లో 43 టీఎంసీలు, ఇంటర్‌లింక్ రివర్ ప్రాజెక్టులో 43 టీఎంసీల జలాలు తెలంగాణ వాటాకు రావాల్సి ఉందన్నారు. అయితే ఎన్వోసీ పేరిట రేవంత్‌రెడ్డి సర్కార్ గోదావరి జలాల్లో వాటాను వదులుకునేందుకు సిద్దం అవుతుందని మండిపడ్డారు. ఇంటర్‌లింక్ రివర్ ప్రాజెక్టులో పోలవరం నుంచి నీళ్లు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తే గోదావరిలో మన నీటి హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గోదావరి ఇంకా 130 టీఎంసీలకు అనుమతులు రాకుండానే ఎందుకు ఆదరాబాదరగా దొంగచాటున రేవంత్ ప్రభుత్వం ఒప్పందానికి రూపకల్పన చేస్తున్నదని ప్రశ్నించారు. గోదావరి జలాల కేటాయింపులు, ఇంటర్‌లింక్ రివర్ ప్రాజెక్టు అంశాలపై అసెంబ్లీలో చర్చపెట్టాలని, ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి తన ఆలోచనలను పంచుకున్న తర్వాతే ఆమోదం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగచాటు వ్యవహారం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని, రేపోమాపో ఢిల్లీకి పోయి అక్రమంగా ఒప్పందాలు చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఒత్తిడితో దేవాదుల మోటర్లు ఆన్
బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే ప్రభుత్వం దేవాదుల మోటర్లు ఆన్ చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. దేవాదులలో 2,500 క్యూసెక్కుల జలాలు ఎత్తాల్సిన చోట 1,500 క్యూసెక్కులు మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నెపల్లి మోటర్లు ఆన్‌చేసి నీళ్లు ఎత్తిపోయవచ్చని తెలిపారు. దేవాదుల కాంగ్రెస్ కట్టడం వల్లే పటిష్టంగా ఉన్నదని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దేవాదుల రీ ఇంజినీరింగ్ చేసి 3వ ఫేజ్‌ను పనులు పూర్తి చేసిందని తెలిపారు. దేవాదుల ద్వారా కాంగ్రెస్ హయాంలో 46వేల ఎకరాలు సాగునీరు అందితే బీఆర్ఎస్ పాలనలో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వివరించారు. దేవాదుల కోసం బీఆర్ఎస్ 30వేల ఎకరాల భూసేకరణ జరిపితే కాంగ్రెస్ 3వేల ఎకరాల సేకరించటంలోనూ విఫలమవుతున్నదని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మాణిక్యం, మామిళ్ల రాజేందర్, కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్‌రెడ్డి, నరహరిరెడ్డి పాల్గొన్నారు.
ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఎందుకంత ప్రేమ?
ఏడు నెలలుగా ప్రభుత్వం ఏం చేస్తున్నందని చేస్తుందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో బనకచర్ల ప్రాజెక్టుపై రిట్ వేస్తే కొట్టివేశారని ఇప్పుడు సూట్ వేస్తే అదికూడా డిస్మిస్ చేశారని మండిపడ్డారు. గోదావరి నల్లమల్లసాగర్ ఏపీ టెండర్లు క్లోజ్ చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ వేయలేదన్నారు. డిసెంబర్ 11, 2025న టెండర్లు క్లోజ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 16 డిసెంబర్ 2025 సుప్రీంలో రిట్ వేసినట్టు చెప్పారు. తిరిగి ప్రభుత్వం సూట్ వేస్తే అది డిస్మిస్ అయిందని చెప్పారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవటంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతున్నదని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ నిర్మించే అనేక అక్రమ ప్రాజెక్టులను ఆపేందుకు బీఆర్ఎస్ స్టే తీసుకొచ్చిందని గుర్తుచేశారు. గోదావరిబనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మొదటినుంచీ బీఆర్ఎస్ చెబుతుంటే.. బనకచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి మొదటినుంచి ఏపీకి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు.
గలగలా గోదారిఆంధ్రాకు పారి!