హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 ఉద్యోగుల నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గ్రూప్ -1 నియామకాల కోసం జరిగిన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వీటిపై విచారణ చేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 563 పోస్టుల కోసం జరిగిన ఎంపిక ప్రక్రియలో మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయని, నోటిఫికేషన్ రద్దు చేసి.. మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని పేరొన్నారు. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మూల్యాంకనంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పినప్పటికీ హైకోర్టు తమ వాదనలు పట్టించుకోకుండా తీర్పు ఇచ్చిందని అభ్యర్థుల తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. టీఎస్పీఎస్సీ తరఫున వాదించిన న్యాయవాది నిరంజన్‌రెడ్డి.. పరీక్షల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి తప్పులు జరుగలేదని అన్నారు. ఎంపికైన అభ్యర్థులు పోస్టుల్లో చేరి విధులు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ అభ్యర్థుల పిటిషన్‌ను కొట్టేసింది.