బీఆర్ఎస్ పోరాటం.. కాంగ్రెస్ ప్రచారం!
చెట్టు నాటి, నీళ్లు పోసింది ఒకరైతే.. పండ్లు కోసుకొని పండుగ చేసుకుంటున్నది మరొకరు అన్నట్టుగా మియాపూర్ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మైలేజ్ డ్రామా సాగుతున్నది.
- బీఆర్ఎస్ హయాంలోనే అత్యధిక విచారణలు
- మియాపూర్ భూములపైప్రభుత్వ పెద్దల క్రెడిట్ చోరీ
- తమ ఖాతాలో వేసుకునేందుకు సీఎం, మంత్రుల పాట్లు
- 2003లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన భూముల కేసు
‘యుద్ధం ఏకస్య – జనఘోష అన్యస్య’ అంటే యుద్ధం ఒకరు చేస్తే, జై కొట్టించుకున్నది మాత్రం ఇంకొకరు అని అర్థం. బాహుబలి-1 సినిమాలో కాలకేయుడిని తుదముట్టించిన తీరును గుర్తుచేసుకుంటే దీని భావం విపులంగా అర్థమవుతుంది. మహేంద్ర బాహుబలి వీరోచితంగా పోరాడి కాలకేయుడిని మట్టికరిపిస్తాడు. కానీ చివర్లో బల్లాల దేవుడు తన గదతో కాలకేయుడి తల బద్దలు కొడతాడు. అంతే! బల్లాల తండ్రి బిజ్జలదేవుడు ‘నా కొడుకు.. నా కొడుకు’ అంటూ జేజేలు కొట్టిస్తాడు.
హైదరాబాద్‌లోని మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల వైఖరిని గమనిస్తే బల్లాలదేవుడు, బిజ్జలదేవుడి తీరు గుర్తుకువస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అనేక ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కటింగ్ చేయడం ఆనవాయితీగా మార్చుకున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. చివరికి మియాపూర్ భూములపై బీఆర్ఎస్ సర్కార్ ఏడున్నర సంవత్సరాలపాటు సాగించిన న్యాయ పోరాటంతో వచ్చిన ఫలాన్ని సైతం తమ ఘనతగానే ప్రచారం చేసుకుంటున్నది.
మియాపూర్ భూముల వ్యవహారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది 2003 సంవత్సరంలోనే అయినా.. తీర్పు వెలువడే వరకు జరిగిన విచారణలు, అధికారులు తిరుగులేని సాక్ష్యాలతో ప్రైవేట్ వ్యక్తుల ఆట కట్టించిన తీరును లోతుగా పరిశీలిస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ భూముల కోసం చేసిన తపస్సు అర్థమవుతుంది. ఆ ఫలాన్ని కాంగ్రెస్ పెద్దలు పొందేందుకు తహతహలాడుతున్నట్టు స్పష్టమవుతుంది. అంతేకాదు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెమటోడ్చి, అంకితభావంతో పనిచేసిన కలెక్టర్లు మొదలు ఆర్డీవోలు, తహసీల్దార్ల కృషిని అవహేళన చేసినట్టుగా ఉన్నదని రెవెన్యూవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : చెట్టు నాటి, నీళ్లు పోసింది ఒకరైతే.. పండ్లు కోసుకొని పండుగ చేసుకుంటున్నది మరొకరు అన్నట్టుగా మియాపూర్ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మైలేజ్ డ్రామా సాగుతున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 100లో 277.05 ఎకరాలు, సర్వేనంబర్ 101లోని 273.34 ఎకరాలు మొత్తం 550.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. రెవెన్యూ రికార్డులు, సేత్వార్ ప్రకారం ఈ భూములు ప్రభుత్వ పోరంబోకుగా రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ విలువైన భూములపై కొందరు కన్నేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటిని కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు 1995 ప్రాంతంలో అప్పటి ఏపీ భూ కబ్జా నిరోధక చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులను సమగ్రంగా విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ భూములను వెంటనే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భూములపై కన్నేసిన కొందరు పెద్దలు.. అధికారుల ముందరి కాళ్లకు బంధం వేశారు. ప్రైవేట్ వ్యక్తులు 1997లో సివిల్ కోర్టును ఆశ్రయించినా చుక్కెదురైంది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. 2003లో హైకోర్టు సైతం ఆ భూములు ప్రభుత్వానివేనని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ భూములను అప్పటి హుడా ప్రస్తుత హెచ్ఎండీఏకు బదలాయించింది. సదరు ప్రైవేట్ వ్యక్తులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2003లోనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అప్పటి నుంచి సుదీర్ఘ వాదనల తర్వాత రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ సమయంలో దాదాపు 20కిపైగా ప్రత్యేక పిటిషన్లను 23 ఏండ్లపాటు విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివిగా స్పష్టంచేసింది.
వైద్యనాథన్‌ను రంగంలోకి దించిన బీఆర్ఎస్ సర్కార్
మియాపూర్‌లో సుమారు రూ.30వేల కోట్ల విలువైన 550.39 ఎకరాల భూముల్ని పరిరక్షించి, ప్రైవేట్ వ్యక్తుల ఆట కట్టించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషిచేసింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణల తీరు, ప్రభుత్వపరంగా వేసిన కౌంటర్ పిటిషన్లు, దాఖలు చేసిన ఆధారాలను (ఎగ్జిబిట్స్) చూస్తే ఇది అర్థమవుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మియాపూర్ భూములను ఎలాగైనా కాపాడి, సర్కార్ ఖాతాలో వేసేందుకు 2015 ఏప్రిల్ 7న ప్రముఖ న్యాయవాది వైద్యనాథన్‌ను, ప్రత్యేకంగా అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌గా పాల్వాయి వెంకట్‌రెడ్డిని నియమించింది. వీరి సారథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు ఎంతో శ్రమించి, అనేక ఆధారాలు సంపాదించి, కోర్టుకు సమర్పించారు. దాని ఫలితంగానే రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. మియాపూర్ భూములపై సుప్రీంకోర్టులో కేసు ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2003 నుంచి ఇప్పటివరకు (కరోనా రెండు సంవత్సరాలు మినహాయిస్తే) 23 సంవత్సరాల్లో 192 సార్లు విచారణ జరిగింది.
అంటే సుప్రీంకోర్టు అన్ని దఫాలుగా ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ వ్యక్తుల వాదనలు విన్నది. ఇందులో 2003 నుంచి 2004 మే వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, అప్పటి నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ పదకొండు సంవత్సరాల్లో 95 సార్లు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. అంటే ఏడాదికి రమారమి 8.63 శాతం మేర విచారణలు జరిగాయి. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఏకంగా 86 సార్లు విచారణలు జరిగాయి. ఇందులో రెండు సంవత్సరాల పాటు కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు అత్యవసర కేసులను మాత్రమే విచారించింది. అంటే దాదాపు తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి సుమారు 11.50 శాతం చొప్పున విచారణలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి విచారణ ఈ ఏడాది మేలో జరిగింది. అప్పుడు తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట వెలువరించింది. అంటే ఏడాదిన్నరపాటు కాంగ్రెస్ హయాంలో సుప్రీంకోర్టు కేవలం పదకొండు పర్యాయాలు మాత్రమే విచారణ నిర్వహించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సుప్రీం విచారణలు అత్యధికంగా జరిగాయన్నది ఈ అంకెల ద్వారా స్పష్టమవుతున్నది.
ఆసక్తికర, కీలకమైన పరిణామం
వాస్తవానికి మియాపూర్ భూములను కాపాడటంలో 1997 నుంచి ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ యంత్రాంగం విశేష కృషి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను రంగంలోకి దింపిన తర్వాత విచారణలో వేగం పెరుగడంతోపాటు ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించడంలో కీలక అడుగులు పడ్డాయని అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు గుర్తుచేసుకుంటున్నారు. ఇందులోభాగంగా రిటైర్డ్ జేసీ పొద్దార్ సురేశ్ తన అనుభవాన్ని వివరించారు. సుప్రీంకోర్టులో హౌసింగ్ సొసైటీలు కూడా కేసులు వేశాయి. కానీ అందులో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని చెప్పారు.
అంటే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంగా నమ్మించి, ఒకరికి అనుకూలంగా వచ్చిన తీర్పుతో భూములు కొట్టేయాలనే కుయుక్తులు కూడా పన్నారన్నమాట. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు అందులోనూ ఇంప్లీడ్అయి, వాదనలు వినిపించారు. దీంతోపాటు ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ భూముల్లో కొంత భాగాన్ని తాను వేలంలో కొనుగోలు చేసినందున సేల్ సర్టిఫికెట్ కూడా వచ్చిందంటూ సుప్రీంకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఉంచారు. అందులో నారాయణఖేడ్ జిల్లా వికారాబాద్ తాలూకా శేరిలింగంపల్లి గ్రామంగా పేర్కొన్నారు. దీనిని గమనించిన అధికారులు రాష్ట్ర ఆర్కైవ్స్, పరిశోధనాలయంలో విస్తృతంగా వెతికిన తర్వాత లభించిన ఆధారాలతో అసలు ఆ సమయంలో నారాయణఖేడ్ జిల్లానే ఏర్పాటు కాలేదనే లాజిక్‌ను సుప్రీంకోర్టు ముందుంచారు. దీంతో ప్రైవేట్ వ్యక్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని న్యాయస్థానం గుర్తించడం కీలకంగా మారిందని రిటైర్డ్ జేసీ వివరించారు.
కీలకంగా మారిన 2023 నాటి సుప్రీం తీర్పు
‘ఏపీ జాగీర్ల రద్దు నిబంధనలు (ఏపీ అబాలిషన్ ఆఫ్ జాగీర్స్ రెగ్యులేషన్స్), అతియత్ విచారణల చట్టం (అతియత్ ఎంక్వైరీస్ యాక్ట్) కింద ఉన్న సంబంధిత పదజాలాన్ని, నిబంధనలను ఈ కేసులో చర్చించడం సముచితం. ఈ ప్రయోజనం కోసం ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ వర్సెస్ ఎం.ఎస్.మూర్తి, 2023 కేసులో ఈ కోర్టు ఇచ్చిన తీర్పులోని 93వ పేరా నుంచి కొన్ని సంబంధిత పదాలను ఉటంకిస్తున్నాను’ ఇదీ మియాపూర్ భూములపై రెండు రోజుల కిందట సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులో భాగంగా పొందుపరిచిన కొన్ని వాక్యాలు. భూములు ప్రభుత్వానివేనని తీర్పు రావడంలో భూమిక పోషించిన పలు కీలక అంశాల్లో ఇది కూడా ఒకటి అని న్యాయవాదులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్రినిటీ ఇన్ఫ్రా కేసును పరిశీలిస్తే… మియాపూర్ భూములపై కేసులు వేసిన ప్రైవేట్ వ్యక్తుల్లో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఒకరు కీలకం. ట్రినిటీ ఇన్ఫ్రా కేసులోనూ పైగా భూములు తమవేనంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేసిన వ్యక్తుల్లో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథి ఉన్నట్టు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో హైదరాబాద్‌లోని చారిత్రక ఖుర్షీద్ జా పైగా ఎస్టేట్‌కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన వందలాది ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు సదరు పార్థసారథి అండ్ కో ప్రయత్నించారు. హైదర్‌నగర్, హఫీజ్‌పేట, హస్మత్‌పేట, తదితర ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. వీటినే సీఎస్ నెం.14 ఆఫ్ 1958 భూములుగా అభివర్ణిస్తారు. అంటే హైదరాబాద్ భూములపై గోల్డ్‌స్టోన్ సోదరులు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కన్నేసిన వైనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి, వారికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసింది. అందులో భాగంగానే ట్రినిటీ ఇన్ఫ్రాకు వ్యతిరేకంగానూ పోరాటం చేయడంతో 2023 జూన్ 15న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
జాగీర్ల రద్దు తర్వాత ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయని, వారసులకు కేవలం కమ్యుటేషన్ డబ్బులు మాత్రమే చెందుతాయని బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించింది. దానిని సమర్థించిన సుప్రీం కోర్టు ఆ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే మియాపూర్ కేసుల కేసు సమయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను రంగంలోకి దింపిన తర్వాత ఈ కోణంలోనూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అరుదుగా అందుబాటులో ఉన్న జాగీర్ల రద్దు చట్టం పుస్తకం (ఐఏఎస్ రాజయ్య రచించిన) తన వద్ద ఉండటాన్ని గమనించి, మియాపూర్ భూముల కేసు విషయంలో తనకెంతో ఉపయోగపడుతుందని తన వద్ద నుంచి వైద్యనాథన్ తీసుకున్న విషయాన్ని రిటైర్డ్ జేసీ పొద్దార్ సురేశ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంటే రెండు రోజుల కిందట సుప్రీం వెలువరించిన తీర్పులో ఏపీ జాగీర్ల రద్దు చట్టంలోని నిబంధనలు, పదజాలాన్ని వినియోగించడంలో పుస్తక ఆధారంగా వైద్యనాథన్ చేసిన వాదనలు కూడా తోడ్పడి ఉంటాయని పొద్దార్ సురేశ్ అభిప్రాయపడ్డారు.
కేసు పేరు:
మియాపూర్ భూముల కేసు.. Bandari Ramchander & Ors. vs. Maitri Coop. Housing Society Ltd. & Ors.
కేసు నెంబర్: Civil Appeal No. 10699 of 2013 and connected appeals (20 SLPలు కలిపి)
తీర్పు ఇచ్చిన బెంచ్: జస్టిస్ ఎంఎం సుందరేష్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
కేసు పూర్వాపరాలు ఇవి:
ప్రత్యేక సివిల్ కోర్టులో తొలుత పిటిషన్ దాఖలైన సంవత్సరం: 1995 సుప్రీంకోర్టులో మొదటి హియరింగ్: 25.08.2003
ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిన తేదీ: 16.04.2003
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లిన తేదీ: 28.04.2003 (SLP (డైరీ నంబర్ 9266/2003)) అనంతరం సివిల్ అప్పీల్ నంబర్ 10699 of 2013 కేటాయింపు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

