హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): విపత్తు నిర్వహణ నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే విపత్తు నిర్వహణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదని పల్లా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రూ.1,100 కోట్ల కరోనా సహాయాన్ని దారి మళ్లించి మరో చోట ఖర్చు చేసినందుకు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు అందించిన నష్టపరిహారం వివరాలను తెలియజేస్తూ మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. ఈ నెల 13న జారీచేసిన నోటీసులకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడంపై కోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ, సహాయ నిధులను పర్సనల్ డిపాజిట్ అకౌంట్లకు బదిలీ చేయవద్దని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.