చిక్కడపల్లి, అక్టోబర్ 27: కర్ణాటక రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ తెలిపారు. గురువారం ఆర్య, ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామీజీ ఆధ్వర్యంలో కర్ణాటకలో కల్లుగీతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న పాదయాత్రకు ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వారు మద్దతు తెలిపారు.
అనంతరం చిక్కడపల్లిలోని కమిటీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కల్లుగీత వృత్తిని నిర్వీర్యం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పాలిత అనేక రాష్ర్టాల్లో కల్లును నిషేధించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్లుని నిషేధించండంతో కర్ణాటకలో 70 లక్షల జనాభా ఉన్న ఈడిగ కులస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అండగా ఉండాల్సిన ప్రభుత్వం కులవృత్తులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని వారు విమర్శించారు.