హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యసేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంక్పలించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైద్య ఆరోగ్యశాఖపై.. వివరిస్తూ.. టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్
నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హస్పిటళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, వీటిని గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి హాస్పిటల్లో 1000 పడకల చొప్పున 4వేల పడకలతో నాలుగు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేయబోతున్నది. అదే విధంగా నిమ్స్ హాస్పిటల్లో మరో 2వేల పడకలను ప్రభుత్వం పెంచబోతుందన్నారు. దీంతో నిమ్స్‌లో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు.
హెల్త్ సిటీగా వరంగల్‌ను నిర్మించాల్సిన ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో కొత్తగా 2వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని, 24 అంతస్తులతో నిర్మించబోయే ఈ ఆసుపత్రి కోసం రూ.11000కోట్లు వెచ్చించనుందన్నారు.
ఇందులో 35 సూపర్‌స్పెషాలిటీ విభాగాలు ఉంటాయని, గుండె, కిడ్నీ, కాలేయం తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతో పాటు క్యాన్సర్వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ, రేడియేషన్ వంటి అత్యాధునిక చికిత్సలూ ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని చెప్పారు.