పెద్దపల్లి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ – న్యూఢిల్లీ తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాష్ట్రంలోని కీలక జంక్షన్లు, రైల్వేస్టేషన్లలో ఆగకుండా నేరుగా దేశరాజధానికి వెళ్తున్నది. రాష్ట్రంలో 30 స్టేషన్ల మీదుగా వెళ్తున్న ఈ ట్రైన్ కేవలం ఏడు చోట్ల మాత్రమే ఆగుతున్నది. దీంతో ఉత్తరాది రాష్ర్టాలకు వెళ్లే రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ రాష్ట్రంలో 16 స్టేషన్లలో ఆగుతుండగా రైలు ప్రయాణిస్తున్న ఏడు రాష్ర్టాల్లో 25 స్టాప్‌లు ఉన్నాయి. తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ (నాంపల్లి) నుంచి కొత్త ఢిల్లీ 12723గా ఎగువ మార్గంలో, కొత్త ఢిల్లీ నుంచి హైదరాబాద్ (నాంపల్లి) 12724గా దిగువ మార్గం లో నడుస్తున్నది. ఈ రైలు రాష్ట్రంలోని సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి జంక్షన్ల మీదుగా ఢిల్లీకి వెళ్తున్నది. రాష్ట్రంలోని హైదరాబాద్, మలాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను తాకుతూ వెళ్తున్నది. కానీ, సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్లు, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్లలో మాత్రమే ఆగుతున్నది. పెద్దపల్లి జంక్షన్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లోని రైల్వే స్టేషన్లలో స్టాప్‌లు ఇవ్వలేదు. ఈ మూడు జిల్లా కేంద్రాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగే సదుపాయం కల్పించాలని దశాబ్ద కాలంగా కోరుతున్నా ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. ఈ రైలుకు ఆదివాసి బిడ్డ కుమ్రంభీమ్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడి స్టేషన్ల మీదుగా రైలు వెళ్తున్నా ఆగకపోవడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.